- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్
గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె కనగల్ మండలం జి. ఎడవెల్లి, ఇస్లాం నగర్ గ్రామంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటింగ్ జరిగిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.

దిశ, కనగల్: గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె కనగల్ మండలం జి. ఎడవెల్లి, ఇస్లాం నగర్ గ్రామంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటింగ్ జరిగిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తిగా ఎలాంటి తప్పులు లేకుండా చేయాలని అధికారులకు సూచించారు. పోలింగ్ అనంతరం కౌంటింగ్ ప్రక్రియలో పాటించవలసిన నిబంధనలు, జాగ్రత్తలు, భద్రతా చర్యలపై అక్కడే విధుల్లో ఉన్న ఎన్నికల సిబ్బంది, పోలీసు అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్లతో మాట్లాడుతూ ఒక అభ్యర్థికి ఒక ఏజెంట్ మాత్రమే లోపలికి అనుమతించాలన్నారు.
పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసిన తర్వాత అసలైన బాధ్యత కౌంటింగ్ దశలో ప్రారంభమవుతుందన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో జరిగే ప్రతి చర్య ఎన్నికల పారదర్శకతను ప్రతిబింబిస్తుందన్నారు. అందువల్ల ఓట్ల లెక్కింపులో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా చూసుకోవాలని చెప్పారు. బ్యాలెట్ బాక్సులు, కవర్‌లు, ఫారమ్‌లు, స్టేట్మెంట్‌లు అన్నింటిలో జాగ్రత్తగా వ్యవహరించాలని, బ్యాలెట్ల పరిశీలనలో పారదర్శకత అత్యంత ముఖ్యమని చెప్పారు. బ్యాలెట్ పేపర్‌ను చెల్లిన ఓటు, చెల్లని ఓటు అని నిర్ణయించే సమయంలో ప్రతీ టేబుల్ వద్ద RO, ARO మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరించాలని అన్నారు. ఏవైనా అభ్యంతరాలు వచ్చినప్పుడు టేబుల్ సూపర్‌వైజర్ తక్షణమే ROను సంప్రదించి, స్పష్టత తీసుకోవాలని చెప్పారు. అభ్యంతరం వచ్చిన ఓటును ప్రత్యేక కవర్లో ఉంచి, నోటింగ్‌లు పూర్తి చేయాలన్నారు.
ఒక్క చిన్న పొరపాటు తుది ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అత్యంత జాగ్రత్త అవసరమన్నారు. ప్రతి ఓటు ప్రజల నమ్మకానికి ప్రతీక అని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కౌంటింగ్ ప్రక్రియను అత్యంత నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం అందరి బాధ్యత అని కలెక్టర్ అన్నారు. ఎవరూ ఒత్తిళ్లకు, ప్రభావాలకు లోనుకావద్దన్నారు. కౌంటింగ్ వేగంగా జరగడం కంటే ఖచ్చితమైన ఫలితాలు రావడం ప్రధాన లక్ష్యమన్నారు. అందువల్ల ప్రతి టేబుల్ వద్ద సిబ్బంది శ్రద్ధగా ఆతురత లేకుండా పని చేయాలన్నారు. అన్ని ఫారమ్‌లు, నమోదు పత్రాలు పూర్తిగా తనిఖీ చేసిన తరువాతే రౌండ్ ఫలితాలను ప్రకటించాలని చెప్పారు. ఫలితాలు పూర్తయిన తర్వాతే ఫామ్- 29 ను గెలిచిన అభ్యర్థికి సర్పంచ్ గా ఇవ్వాలని తెలిపారు. జడ్పీ సీఈవో శ్రీనివాస రావు, నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, కనగల్ తహశీల్దార్ పద్మ, ఎంపీడీవో వేద రక్షిత, ఎంపీఓ సతీష్ కుమార్, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.






