రేపు ఆలేరు నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి.. ఏర్పాట్లు పూర్తి

by Bhanu |

తుర్కపల్లి మండలం తిరుమలపురం గ్రామంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సర్వం సిద్దమైంది.

రేపు ఆలేరు నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి.. ఏర్పాట్లు పూర్తి
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : తుర్కపల్లి మండలం తిరుమలపురం గ్రామంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సర్వం సిద్దమైంది. ఆలేరు నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైన గంధమల్ల ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. వీటితోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు బహిరంగ సభ వద్ద నుంచే శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

ఏర్పాట్లు పూర్తి..

తిరుమలాపూర్ గ్రామంలో సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాస్థాయి యంత్రాంగం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. గత అయిదు రోజులుగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీసీపీ అక్షాంశ్ యాదవ్ పూర్తిస్థాయిలో పనులను పర్యవేక్షించారు. ఈ సమావేశం కోసం ప్రత్యేకంగా మూడు వాటర్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేశారు. పార్కింగ్ కోసం భువనగిరి గజ్వేల్ రహదారిపై 10కి పైగా ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేశారు. స్టేజ్ ముందు విఐపి లకు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సభ వేదిక వద్ద రెండు పెద్ద ఎల్ఈడీలు, అక్కడక్కడ చిన్న ఎల్ఈడీ లను సైతం అమర్చారు. సభకు తరలివచ్చే ప్రజలకు ప్రదేశం వద్ద ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలను తీసుకున్నారు.

ఏర్పాట్లను పర్యవేక్షించిన సీపీ

బహిరంగ సభ ఏర్పాట్లను రాచకొండ సీపీ సుధీర్ బాబు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. బహిరంగ సభ స్టేజి, వీఐపీల గ్యాలరీ, పార్కింగ్ ప్రదేశాలు, మీడియా గ్యాలరీ తదితర ప్రదేశాలను పరిశీలించారు. ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ వెల్లడించారు.

1.45 గంటల పాటు సాగనున్న పర్యటన

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన 1.45 గంటలపాటు పర్యటన సాగనుంది. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎం, 3 గంటలకు బహిరంగ సభ వద్దకు చేరుకొనున్నారు. 3.10 నుంచి 3.25 గంటల వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 3.25 నుంచి 4.40 వరకు సభ జరగనుంది. 4.45 గంటలకు హెలికాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్ చేరుకొనున్నారు‌‌.

హాజరవనున్న మంత్రులు..

ఈ బహిరంగ సభకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ్మ, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో‌ పాటు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవనున్నారు.



Next Story