చల్లూరు భూ కుంభకోణం.. అంతులేని అవినీతితో గ్రామస్తులకు నష్టం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-28 02:04:28  IST  )

ఏ భూమి సమాచారం కావాలన్నా 1956 ఖాస్రా పహాని భూ రికార్డు చూస్తేనే లెక్క తెలుస్తుంది.

చల్లూరు భూ కుంభకోణం.. అంతులేని అవినీతితో గ్రామస్తులకు నష్టం
X

దిశ, రాజాపేట: ఏ భూమి సమాచారం కావాలన్నా 1956 ఖాస్రా పహాని భూ రికార్డు చూస్తేనే లెక్క తెలుస్తుంది. కానీ ఖాస్రా పహాని రికార్డులనే సృష్టించి వందల ఎకరాలు చేతులు మారిన భూభాగోతం యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం చల్లూరు 322 సర్వే నెంబర్లో బహిర్గతం అవుతున్నది. నిషేధిత జాబితాలో ఉన్న భూమి, కోర్టు కేసుల్లో ఉన్న ఈ సర్వే నెంబర్లో 1575 ఎకరాల భూమి ఉండాల్సింది. ఇందులో ఒక పార్ట్ లో 322/4/అ లో సుమారు 880 ఎకరాల భూమి ఉంది. 1975లో సీలింగ్ యాక్ట్ లో 800 ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకోగా 1993 తర్వాత ప్రభుత్వం స్వాధీన చేసుకున్న 800 ఎకరాల భూములకు కొత్త ఖా స్రా పుట్టుకొచ్చింది. ఆ తర్వాత ఇష్టాను సారంగా రిజిస్ట్రేషన్లు చేయడానికి ప్రోత్సహించి సర్వే నంబర్ మొత్తంలో 2200 ఎకరాల పైబడి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు జరిగాయి.

రెండు ఖాస్రాలతో ఉండాల్సిన భూమి కంటే ఎక్కువ భూమి యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు కావడంతో ధరణిలో వారికి అనుకూలంగా ఉన్న వాళ్ళవి పేరు నమోదు చేశారు. దీంతో సన్న చిన్న కారు రైతుల భూములు కోల్పోగా వ్యాపారుల భూములు పెరిగాయి. ఆ డాక్యుమెంట్ల ద్వారా వెంచర్లుగా చేసి నిషేధిత జాబితాలో ఉన్న భూమిని కూడా ప్లాట్లుగా మార్చి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. వ్యవసాయ భూములు కొన్న డాక్యుమెంట్లు ఒకరి పేరుమీద, పర్మిషన్లు సంస్థల పేరు మీద, అమ్మకాలు మార్కెటింగ్ వాళ్ళు చేస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తూ ప్లాట్లు అంటగడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. భూమికి సంబంధించిన వివాదాలు ఏవి చూడకుండా డాక్యుమెంట్లతోనే డీటీసీపీ అధికారులు కొన్నింటికి పర్మిషన్లు ఎలా ఇచ్చారు? అనేది ప్రశ్నార్థకంగా మారినది. వారు చేసిన తప్పును కప్పించుకోవడానికి అందరూ అధికారులతో బాగోతం నడిపిస్తున్నట్లు ఈ సర్వే నెంబర్ లో కనబడుతున్నది. హైదరాబాదుకు దగ్గరగా, యాదగిరిగుట్ట సమీపంలో అని ఆశ చూపి హైదరాబాద్ వారికే ప్లాట్లు అమ్ముతున్నట్లు సమాచారం. ఈ తతంగం వెనుక కోట్ల రూపాయలు చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి. చేసిందంతా చేసి మాకు సంబంధం లేదు అన్నట్టుగా రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు వ్యవహరిస్తున్నారు. వెంచర్ చేసే క్రమంలో భారీగా బాంబులు పేల్చి గుట్టలను తొలుచుతూ భూములను తోడుతూ గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తూ ఇష్టానుసారంగా రోడ్లు తీసి భూములను కబ్జా కోరల్లోకి వెంచర్ యజమానులు తెచ్చుకున్నారు. ఎలాంటి పర్మిషన్లు లేకున్నా మైనింగ్ అధికారులు, డీటీసీప అధికారులు,జిపి అధికారులు, ఇతర అధికారులు అటువైపు చూడడం లేదన్న విమర్శలు గ్రామ ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.

ఎక్సెస్ భూములు ఇలా...?

ధరణిలో భూమి వివరాలు నమోదు చేస్తుండడంతో ఎక్సెస్ భూముల బాగోతం బయటకు వచ్చింది. చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయో అని 322/4/ఐ లో ఎకరం 30 గుంటలు ఉంటే ధరణిలో 153 ఎకరాలుగా వివిధ పేర్లపై నమోదు చేశారు. 322/4/లూ లో ఎకరం 15 గుంటలు ఉంటే 62 ఎకరాలుగా,322/4/ఖ లో 7 ఎకరాల 12 గుంటలకు బదులుగా 78 ఎకరాలుగా,322/4/ఝాలో 8 ఎకరాల 25 గుంటలకు 56 ఎకరాలు, 322/4/లు లో 10 ఎకరాల 22 గుంటలకు 62 ఎకరాలను వివిధ పేర్లలో ధరణి లో నమోదు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. లేని భూములను ఇష్టానుసారంగా ఎలా నమోదు చేశారనేది పరిశీలిస్తే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో ఊహించుకోవచ్చు. యాదగిరిగుట్ట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పాత పాస్ పుస్తకం జిరాక్స్ పట్టుకుపోయి దళారులు ఎన్ని ఎకరాలు అంటే అన్ని ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయమంటే చేసిన ఉదంతాలు ఉండడంతో ఇలా పేద రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురవుతున్నదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.

సీలింగ్ భూములు పట్టాగా ఎలా మారాయి?

డీటీసీపీ అధికారులు పర్మిషన్లు ఏ ప్రాతిపదికన ఇచ్చారు? రాష్ట్ర స్థాయి అధికారుల బృందం విచారణ చేపడితే గాని పూర్తి వివరాలు బయటకు రాని పరిస్థితి. ప్రభుత్వం రాష్ట్ర స్థాయి అధికారుల బృందంతో విచారణ చేపడితే ప్రభుత్వానికి రూ.500 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది. భూములు కోల్పోయిన గ్రామ పేద సామాన్య ప్రజలను, దళితులను, అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొని మోసపోయే వారిని రక్షించే వారు అవుతారని ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ యంత్రాంగం వెంటనే విచారణ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వెంచర్ల డాక్యుమెంట్లను వెరిఫై చేసి వ్యవసాయ, వ్యవసాయేతర భూములను గుర్తించి, భూముల రికార్డులు సృష్టించి భూమి బదలాయించుకున్న వారి డాక్యుమెంట్లు రద్దు చేయాలని, 322 సర్వేనెంబర్లో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు యాదగిరిగుట్ట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఆపే విధంగా కలెక్టర్ నోటీసు ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

కొన్నింటికి పర్మిషన్లు ఉన్నాయి.. పంచాయతీ కార్యదర్శి జి. మహేష్

చల్లూరు 322 సర్వే నెంబర్లో పుట్టగొడుగుల్లా వెంచర్లు పుట్టుకొచ్చిన విషయాన్ని ' దిశ ' గ్రామపంచాయతీ కార్యదర్శి జి.మహేష్ ను వివరణ కోరగా కొన్నింటికి పర్మిషన్లు ఉన్నాయని నేను లేనప్పుడు పాత అధికారులు హయాంలో పర్మిషన్లు ఇచ్చినట్లు తెలిపారు. నోటీసులు ఇస్తే కొందరు వెంచర్ నిర్వాహకులు 10% ల్యాండ్ ఇచ్చారని పొజిషన్ మాత్రం చూడలేదని తెలిపారు.

Next Story