ఆచితూచి అడుగులు...

by I. Sairam |

సూర్యాపేట జిల్లాలో మున్సిపల్ నగారా మోగకముందే రాజకీయ సెగలు రాజుకుంటున్నాయి.

ఆచితూచి అడుగులు...
X

దిశ, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో మున్సిపల్ నగారా మోగకముందే రాజకీయ సెగలు రాజుకుంటున్నాయి. జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మునిసిపాలిటీల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి సర్వేల ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని పార్టీలు సంకేతాలిస్తుండటంతో ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది.ఒకవైపు ప్రజాభిప్రాయం, మరోవైపు సామాజిక సమీకరణాల మధ్య టికెట్ ఎవరిని వరిస్తుందో అన్నది ఉత్కంఠగా మారింది.

గత అనుభవాలతో ముందుకు....

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి పార్టీలు ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి. కేవలం సిఫార్సులకే ప్రాధాన్యం ఇవ్వకుండా వార్డు స్థాయిలో అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్, స్థానిక సమస్యలపై వారి స్పందన, సామాజికవర్గాల మద్దతును లెక్కగడుతున్నాయి. ఇందుకోసం కొన్ని పార్టీలు ప్రొఫెషనల్ సర్వే ఏజెన్సీ లతో రహస్య నివేదికలు తెప్పించుకుంటున్నాయి.టికెట్ ఆశించేవారి సంఖ్య భారీగా ఉండటంతో అసంతృప్త జ్వాలలు ఎగిసిపడే అవకాశం ఉంది. సర్వేల పేరుతో సీనియర్లను పక్కన పెడితే తిరుగు బాటు తప్పదని ఆశవాహులు చెప్పకనే చెబుతున్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల ఉత్సాహంతో కాంగ్రెస్...

గ్రామ పంచాయతీ ఎన్నికల ఉత్సాహంతో మున్సిపల్ ఎన్నికల్లోనూ జెండా పాతాలని కాంగ్రెస్ చూస్తోంది. సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్ష అని భావిస్తోంది. పార్టీ మారుతారనే అనుమానం ఉన్న నేతలపై నిఘా పెట్టింది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేతలపై నిఘా పెట్టినట్టు సమాచారం. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో జరిగే విషయలని బీఆర్ ఎస్ పార్టీ కి సమాచారం ఇస్తున్నారని అనుమానంతో పసిగట్టిన కాంగ్రెస్ పార్టీ నేతలు సమాచారం ఇస్తున్న ఓ ఇద్దరిని తీవ్రంగా మందలించినట్లు ప్రచారం జరిగింది. అలాగే, కౌన్సిలర్ అభ్యర్థులకు టికెట్ కేటాయించే విషయంలోనూ ఆ వ్యక్తి పూర్వాపరాలను క్షుణ్ణంగా పరిశీలించి పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తుంది.

బీఆర్ఎస్ పార్టీ జిల్లాను కంచుకోటగా భావిస్తున్న గులాబీ పార్టీ జిల్లావ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని పట్టుదలతోఉoది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని మరింత పటిష్టంగా మలుచుకునే దిశగా పావులు కదుపుతోంది. రిజర్వేషన్లు ఖరారైన తర్వాత తుది జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అన్ని పార్టీల్లో అంతర్గత కసరత్తు రిజర్వేషన్ల కేటాయింపు తర్వాతే అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడంతో పాటు స్థానికంగా ఓటర్ల మద్దతును కూడగొట్టే పనిలో ఆశావహులు నిమగ్నమయ్యారు.

పెద్ద సంఖ్యలో ఆశావహులు...

మున్సిపల్ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్ పోటీ చేసేందుకు ఆశావహులు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా మాజీ కౌన్సిలర్ల తో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు సైతం పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో ఆశావహులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. తమకు టికెట్ కేటాయించక పోతే రెబల్స్ నైనా ఉంటామని స్పష్టం చేస్తున్నారు. వార్డుల్లో అందరి నీ కలుస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. వ్యక్తి గత సర్వేలు కూడా చేసుకుంటారు.

మున్సిపాలిటీల వారీగా వార్డులు..

సూర్యాపేట 48

కోదాడ 35

హుజూర్ నగర్ 28

నేరేడుచర్ల 15

తిరుమలగిరి 15

Next Story