వ్యక్తిగత దూషణలు మానండి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పిలుపు

by Bhanu |

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచందర్ రావు రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలకు తావు ఉండకూడదని, విధానాల ఆధారంగా విమర్శలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

వ్యక్తిగత దూషణలు మానండి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పిలుపు
X

దిశ, కోదాడ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచందర్ రావు రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలకు తావు ఉండకూడదని, విధానాల ఆధారంగా విమర్శలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతతో వినియోగించాలని సూచించారు.


ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని, అప్పుడే ప్రజాస్వామ్యం నిజంగా ఫలిస్తుందని అన్నారు. భారత యువత ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. బూతులు మాట్లాడితేనే నాయకుడు అనే భ్రమను మనం వీడాలి. ఒక నాయకుడు సిద్దాంతాలతో నడిచినప్పుడే మంచి పాలకుడవుతాడ ని రామచందర్ రావు స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత తన తొలి జిల్లా పర్యటన ఉమ్మడి నల్గొండ జిల్లాను ఎంచుకున్నారని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం కార్యకర్తలందరూ శ్రమించాలని సూచించారు. ప్రజల విశ్వాసం పొందేందుకు జాతీయ స్థాయి పార్టీగా బీజేపీ నిబద్ధతతో పని చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీరంగాపురంలో అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలువురు న్యాయవాదులు, పార్టీ నాయకులు రామచందర్ రావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, కనగాల వెంకటరామయ్య, మల్లెబోయిన అంజి యాదవ్, నూనె సులోచన, జనార్దన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Next Story