అంగన్‌వాడీలకు ‘డూప్లికేట్’ సెగ

by velandi.Saikiran |

నల్లగొండ జిల్లా అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుత్ పరికరాల సరఫరాలో భారీ అవినీతి చోటు చేసుకుంది.

అంగన్‌వాడీలకు ‘డూప్లికేట్’ సెగ
X

అంగన్‌వాడీలకు ‘డూప్లికేట్’ సెగ

రూ.20లక్షల ప్రభుత్వ సొమ్ము స్వాహా!

బ్రాండెడ్ వస్తువుల పేరుతో టెండర్లు

క్షేత్రస్థాయిలో నాసిరకం పరికరాల పంపిణీ

జిల్లా మినరల్ ఫండ్ నిధులకు కాంట్రాక్టర్ల కన్నం.. అధికారుల అండదండలు?

రూ.20.58లక్షల బడ్జెట్‌లో దాదాపు రూ.7లక్షలకు పైగా గోల్‌మాల్

కేంద్రాలకు చేరిన తర్వాతే పరిశీలిస్తామంటున్న అధికారులు..

అంతర్గత ఒప్పందమేనా?

నల్లగొండ జిల్లా అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుత్ పరికరాల సరఫరాలో భారీ అవినీతి చోటుచేసుకుంది. జిల్లా మినరల్ ఫండ్ నుంచి కేటాయించిన రూ.20.58లక్షల నిధులను కాంట్రాక్టర్ దర్జాగా కాజేశాడు. టెండర్‌లో పేర్కొన్న బ్రాండెడ్ ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లకు బదులు నాసిరకం పరికరాలను సరఫరా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాణ్యమైన వస్తువుల ధరలకు, సరఫరా చేసిన వస్తువుల ధరలకు మధ్య రూ.7లక్షల తేడా ఉన్నట్లు తెలుస్తోంది. హోల్ సేల్ ధరలను లెక్కలోకి తీసుకుంటే ఈ అవినీతి విలువ ఇంకా పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐసీడీఎస్ అధికారులు నాణ్యతను పరిశీలించకుండానే పంపిణీకి సహకరించినట్లు తెలుస్తోంది. కేంద్రాలకు చేరిన తర్వాత పరిశీలిస్తామనడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ప్రభుత్వ నిధులను దోచుకుంటున్న కాంట్రాక్టర్, అధికారులపై విచారణ జరపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

దిశ నల్లగొండ బ్యూరో : ప్రభుత్వ సొమ్మును అప్పనంగా కాజేసేందుకు కొందరు కాంట్రాక్టర్లు, అధికారులు చేతులు కలిపారు. పసిపిల్లలు, గర్భిణులకు సేవలందించే అంగన్‌వాడీ కేంద్రాలకు సౌకర్యాలు కల్పించాల్సిన నిధులను, నాసిరకం పరికరాల సరఫరాతో స్వాహా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని సొంత భవనాలు కలిగిన ఐసీడీఎస్ కేంద్రాలకు ఫ్యాన్లు, ట్యూబ్ లైట్ల కొనుగోలు కోసం కేటాయించిన రూ.20.58లక్షల బడ్జెట్‌లో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు సమాచారం.

రూ.20.58 లక్షల బడ్జెట్..

నల్లగొండ జిల్లాలోని సొంత భవనాలు కలిగిన ఐసీడీఎస్ అంగన్‌వాడీ కేంద్రాలకు అవసరమైన ఫ్యాన్, ట్యూబ్ లైట్లు కోసం జిల్లా మినరల్ ఫండ్ నిధులను కేటాయిస్తూ మార్చి నెలలో ఆన్‌లైన్ టెండర్ ఐడీ 687/901 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫైల్ నంబర్ 275/ఎన్ఎన్ఎం/2026/ ప్రోక్యూర్ మెంట్ ఆఫ్ ట్యూబ్ లైట్లు, ఫ్యాన్. అయితే టెండర్‌లో 802 సీలింగ్ ఫ్యాన్ (క్రాంప్టన్ హై స్పీడ్ హెచ్ఎస్ +) 1060 ట్యూబ్ లైట్లు (ఫిలిప్స్ 20 వాట్స్ 3 ఇన్ వన్ లైట్, 4ఫీట్లు మోడల్ లైట్) నమోదు చేశారు. ఈ మొత్తం పరికరాలు కొనుగోలు చేయడానికి రూ.20,58,900 బడ్జెట్‌ను కేటాయిస్తూ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ పరికరాలు సరఫరా చేయడానికి టెండర్లు రేఖ జనరల్ స్టోర్, సహస్ర ఎంటర్‌ప్రైజెస్, వీడీఎస్ టెక్ సొల్యూషన్స్ మూడు ఏజెన్సీలు టెండర్ వేశాయి. అందులో వీడీఎస్ ఏజెన్సీ ట్యూబ్ లైట్ సరఫరా కోసం రూ.264.64, ఫ్యాన్ సరఫరా కోసం రూ.2243.43 టెండర్ వేసి ఎల్‌వన్ (L1)గా వీడీఎస్ ఏజెన్సీ టెండర్ దక్కించుకుంది.

డూప్లికేట్ పరికరాల పంపిణీ..?

టెండర్ నిబంధనల ప్రకారం నాణ్యమైన పరికరాలను సరఫరా చేయాల్సి ఉండగా, కాంట్రాక్టర్ మాత్రం తక్కువ ధర కలిగిన డూప్లికేట్ పరికరాలను కేంద్రాలకు పంపినట్లు తెలుస్తోంది. టెండర్‌లో పేర్కొన్న ‘క్రాంప్టన్ హై స్పీడ్’ ఫ్యాన్లకు బదులు మార్కెట్లో కేవలం రూ.1,450 విలువ చేసే నాసిరకం మోడళ్లను, అలాగే ‘ఫిలిప్స్ 3-ఇన్-1’ లైట్లకు బదులు రూ.110 విలువ చేసే సాధారణ లైట్లను సరఫరా చేసినట్లు సమాచారం. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం చూస్తే కాంట్రాక్టర్ కేవలం రూ.13లక్షలు మాత్రమే ఖర్చు చేసి, మిగిలిన రూ.7లక్షలకు పైగా ప్రభుత్వ సొమ్మును కాజేసినట్లు స్పష్టమవుతోంది. హోల్ సేల్ ధరలను పరిగణనలోకి తీసుకుంటే ఈ అక్రమ లాభం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

అధికారులు... కాంట్రాక్టర్ కుమ్మక్కై..?

సాధారణంగా ప్రభుత్వ వస్తువులను జిల్లా కార్యాలయంలోనే పరిశీలించి పంపిణీ చేయాలి. కానీ ఇక్కడ అధికారులు మాత్రం పరికరాలు కేంద్రాలకు చేరిన తర్వాతే తనిఖీ చేస్తామని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకసారి గ్రామాలకు వస్తువులు చేరిన తర్వాత వాటిని వెనక్కి తీసుకురావడం అసాధ్యమని తెలిసినా, అధికారులు ఇలా వ్యవహరించడం వెనుక కాంట్రాక్టర్‌తో ఉన్న అంతర్గత ఒప్పందమేనని విమర్శలు వస్తున్నాయి. నాణ్యతను ముందే తనిఖీ చేయకుండా పంపిణీకి సహకరించిన అధికారుల తీరుపై విచారణ జరపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story