కసాయి కొడుకు, బిడ్డ అనే వార్తలే.. వాటిని చూస్తే ప్రాణం కలుక్కుమంటోంది: ఈటల హాట్ కామెంట్స్

by Ramesh Naini |   (  Updated:2025-07-10 08:20:58  IST  )

గురుపూజోత్సవం సందర్భంగా సమాజం జరుగుతున్న అనేక సంఘటనల గురించి తనదైన శైలిలో బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు.

కసాయి కొడుకు, బిడ్డ అనే వార్తలే.. వాటిని చూస్తే ప్రాణం కలుక్కుమంటోంది: ఈటల హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గురుపూజోత్సవం సందర్భంగా సమాజం జరుగుతున్న అనేక సంఘటనల గురించి తనదైన శైలిలో బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar) స్పందించారు. గురువారం మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఆనాడు ఈ కార్పొరేట్ స్కూల్స్ లేవని, ఆశ్రమాల్లో చదువులు ఉండేవన్నారు. నేడు గురువు అంటే గౌరవం లేదని, గురువులకే పంగనామాలు పెట్టేవారు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో.. సంపాదన కంటే విలువలను గొప్పగా భావించే ఈ సమాజంలో ఇప్పుడు డబ్బు, ఆస్తులే కేంద్ర బిందువు అయ్యాయని పేర్కొన్నారు.

వినకూడని కనకూడని సంఘటనలు అనేకం జరుగుతున్నాయని, వాటిని చూసి ప్రాణం కలుక్కుమంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాగుడికి డబ్బులు ఇవ్వలేదని జన్మనిచ్చిన తల్లిని చంపుతున్నారని, మందలించిన ఖర్మానికి తండ్రిని చంపే వారిని కూడా చూస్తున్నామని, కసాయి కొడుకు, కసాయి బిడ్డ అనే వార్తలు చూస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఆడపిల్లలు కూడా తండ్రులను చంపుతున్న సంఘటనలు ఈ మధ్య కనిపిస్తున్నాయని అన్నారు. ఇది కలియుగమని బాధపడాలా ? గొప్ప సంస్కృతి ఉన్న మనం అసహ్యించుకునే విధంగా మారుతున్నామా ? అని ప్రశ్నించారు.

ఈ గురు పరంపర, మన సంస్కృతి సాంప్రదాయాలను సమున్నతంగా, సంపూర్ణంగా నిలుపుకోకపోతే మరింత వికృతచేష్టలతో మానవ జీవితాలు కలంకమయ్యే పద్ధతిలో, అసహ్యించుకునే పద్ధతిలో మారుతుందని అన్నారు. ఈ సమాజానికి పట్టిన టెన్షన్ వదిలించాలంటే ప్రతి ఒక్కరు స్పందించాలని, రాజకీయ వ్యవస్థ కూడా దీనికి బాధ్యత వహించాలని కోరారు. ఇంజనీర్ ఫెయిల్ అయితే బ్రిడ్జి కూలిపోతుంది కానీ ఒక రాజకీయ నాయకుడు ఫెయిల్ అయితే సమాజం కూలిపోతుందని అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకున్ని సమాజంలో చిన్న చూపు చూడకండి.. రాజకీయ నాయకుడు సమాజాన్ని నడిపే గురువు లాంటివాడు. ఆయన సన్మార్గంలో నడిచినప్పుడు మాత్రమే సమాజం చల్లగా ఉంటుంది. ఆ రాజకీయ నాయకున్ని ఎన్నుకునే విషయంలో కూడా అలర్ట్ గా ఉండాలని కోరారు.

Next Story