కుమ్మక్కు రాజకీయాల రూపం బయటపడింది: ఎంపీ డి. కె.అరుణ

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-24 16:49:34  IST  )

రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్​, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాల అసలైన రూపం బయటపడిందని ఎంపీ డి.కె. అరుణ విమర్శించారు.

కుమ్మక్కు రాజకీయాల రూపం బయటపడింది: ఎంపీ డి. కె.అరుణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్​, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాల అసలైన రూపం బయటపడిందని ఎంపీ డి.కె. అరుణ విమర్శించారు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే హైడ్ అండ్ సీక్ రాజకీయ నాటకం కొనసాగుతోందన్నారు. గురువారం ఒక ప్రకటనలో పేర్కొంటూ రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్, వ్యక్తిగత నిఘా, గోప్యత ఉల్లంఘనలపై తీవ్రంగా ఆరోపణలు చేశారు. తనతో పాటు తన కుటుంబం ఫోన్లు ట్యాపింగ్ కు పాల్పడ్డారని అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన అవన్నీ మరిచినట్టుగా, ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే తనకు నోటీసులు వచ్చేవి కదా అనే వ్యాఖ్యలు చేస్తున్నారు.

అలాంటప్పుడు గతంలో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నాటకమా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో కుదిరిన ప్యాకేజీ డీలే కారణమా అనే అనుమానం కలుగుతోందన్నారు. ఈరెండు పార్టీల మధ్య ప్యాకేజీ బేరాలు కుదిరిందనడానికి ఇది నిదర్శనమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణంపై ఇప్పటికే కేంద్ర వ్యవస్థలు సంచలన విషయాలను బయటపెట్టాయి.

ఈ విషయంలో నాడు పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం వేలకోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని, సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసి అధికారంలోకి వచ్చాక అదే బీఆర్ఎస్ పార్టీకి రక్షణ కవచంగా మారారని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతి దర్యాప్తు పేరుతో కాలయాపన చేస్తూ అసలు దోషులను అరెస్ట్ చేయకుండా విమర్శలకే పరిమితమైందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో డ్రగ్స్ , విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి, ఫార్ములా ఈ రేసింగ్ కేసులో నిధుల మళ్లింపు, ల్యాండ్ స్కాంలు, ఉద్యోగ నియామకాలలో అవకతవకలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులన్నింటిపై విచారణ చేపడతామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటి వరకు అసలు దోషులను పట్టుకున్న పరిస్థితి లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ కుటుంబంతో కుమ్మక్కై అవినీతికి కవచంగా మారిందని ఎద్దేవా చేశారు.

Next Story