వీధి కుక్కల దాడిలో గాయపడ్డ బాలుడికి భరోసా.. కలెక్టర్‌కు ఎంపీ చామల ఫోన్

by Gantepaka Srikanth |

భువనగిరి పట్టణంలో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి, దురదృష్టవశాత్తూ కంటిచూపును కోల్పోయిన చిన్నారి ప్రియాంష్ పరిస్థితిపై భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

వీధి కుక్కల దాడిలో గాయపడ్డ బాలుడికి భరోసా.. కలెక్టర్‌కు ఎంపీ చామల ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: భువనగిరి పట్టణంలో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి, దురదృష్టవశాత్తూ కంటిచూపును కోల్పోయిన చిన్నారి ప్రియాంష్ పరిస్థితిపై భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన బాలుడిని ఎంపీ స్వయంగా పరామర్శించారు. కంటికి సంబంధించిన ప్రాథమిక చికిత్స పూర్తయిన నేపథ్యంలో ఎంపీ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి బాలుడి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన తక్షణమే స్పందిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో మరియు బీబీనగర్ ఎయిమ్స్ (AIIMS) ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా చర్చించారు.

చిన్నారి ప్రియాంష్‌కు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది కలగకుండా, బీబీనగర్ ఎయిమ్స్ ద్వారా సాధ్యమైనంత మెరుగైన, అత్యాధునిక వైద్య చికిత్స అందేలా చూడాలని కలెక్టర్‌ను, ఎయిమ్స్ అధికారులను ఎంపీ కోరారు. ఆడుకోవాల్సిన వయసులో ఇలాంటి ప్రమాదం జరగడం అత్యంత బాధాకరమని, బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం తరపున పూర్తి అండగా ఉంటామని చామల కిరణ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు.

Next Story