‘దిశ’ కథనంతో ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక.. ‘TUFIDC’ రూ.3 వేల కోట్ల స్కామ్‌పై ఫోకస్

by Kema Shiva Kumar |

తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ)లో థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఎజెన్సీ రిపోర్టు లేకుండానే బిల్లులు చెల్లిస్తున్నారని ‘దిశ’లో శుక్రవారం ప్రచురితమైన ‘రూ. 3వేల కోట్ల స్కామ్..!’ కథనంపై ప్రభుత్వం స్పందించింది.

‘దిశ’ కథనంతో ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక.. ‘TUFIDC’ రూ.3 వేల కోట్ల స్కామ్‌పై ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ)లో థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఎజెన్సీ రిపోర్టు లేకుండానే బిల్లులు చెల్లిస్తున్నారని ‘దిశ’లో శుక్రవారం ప్రచురితమైన ‘రూ. 3వేల కోట్ల స్కామ్..!’ కథనంపై ప్రభుత్వం స్పందించింది. థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ లేకుండా రూ.3 వేల కోట్ల బిల్లులు ఎలా చెల్లించారని అధికారులను పురపాలకశాఖ, కార్పొరేషన్ చైర్మన్, ఎండీ ప్రశ్నించినట్టు తెలిసింది. దీంతోపాటు థర్డ్ పార్టీ ఎజెన్సీ నియామకానికి టెండర్ నోటిఫికేషన్ జారీచేయాలని ఆదేశించినట్టు తెలిసింది. అంతేకాదు నోటిఫికేషన్ రెడీ చేయడంతోపాటు శనివారం జారీ చేయనున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.

ఆ రూ.15 కోట్లపై ఆరా

టీయూ ఎఫ్ఐడీసీలోని కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అయిన అమృత్, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన జీవో నెంబర్ 51 ద్వారా చెల్లించే బిల్లులకు థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ తప్పనిసరి ఉండాలని, క్వాలిటీ చెకింగ్ కోసం సదరు ఎజెన్సీకి బిల్లులో 0.5 శాతం ఫీజు చెల్లించాలని నిబంధన ఉంది. అయితే ఇప్పటి వరకు చెల్లించిన సుమారు రూ.3వేల కోట్ల బిల్లులకు 0.5 శాతం అంటే రూ.15 కోట్లు అవుతాయి. నాలుగేండ్లుగా థర్డ్ పార్టీ క్వాలిటీ చెక్ ఎవరు చేశారు? ఆ రూ.15 కోట్లను ఎవరికి ఇచ్చారనే అంశంపై పురపాలకశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతోపాటు బిల్లులు చెల్లించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

అమృత్ బిల్లుల చెల్లింపు

టీయూ ఎఫ్ఐడీసీలో అమృత్ స్కీమ్‌కు సంబంధించిన బిల్లుల చెల్లింపులో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలున్నాయి. ఈ స్కీములో కేంద్ర ప్రభుత్వం వాటా 70 శాతం, రాష్ట్ర ప్రభుత్వం వాటా 30 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలను తుంగలోతొక్కి అధికారులు బిల్లులు చెల్లిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఓ కాంట్రాక్టు ఎజెన్సీకి చెందిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వ వాటా లేకుండానే చెల్లించారు. మరో ఎజెన్సీకి చెందిన బిల్లులు చెల్లించడానికి ఈ నిబంధనను చూపిస్తున్నారు. అంటే అధికారులకు నచ్చితే నిబంధనలు అడ్డురాదని, నచ్చకపోతోనే నిబంధనలు గుర్తుకొస్తాయని పలువురు ఇంజినీరింగ్ అధికారులు చర్చించుకుంటున్నారు. ఈ బిల్లుల చెల్లింపులో ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ఓ అధికారిపై పలువురు సీనియర్ ఇంజినీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరిస్తున్నారు.

Next Story