మొంథా ప్రభావంతో రాష్ట్రంలో దంచికొడుతున్న వానలు

by Muthe.Rajitha |

మొంథా తుఫాన్ ప్రభావంలో రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి.

మొంథా ప్రభావంతో రాష్ట్రంలో దంచికొడుతున్న వానలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మొంథా తుఫాన్ ప్రభావంలో రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి. బుధవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కురిసిన అత్యంత భారీ వర్షాలకు రోడ్లు తెగిపోయి ప్రయాణాలు స్తంభించాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలపింది. హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, సూర్యాపేట, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. హెచ్చరికలు జారీ చేసిన జిల్లాల్లో 50 నుండి 60 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో తక్షణ సహాయ చర్యలకు సిద్దంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించింది.

బలహీనపడనున్న మొంథా:

తీవ్ర వాయుగుండంగా మారిన మొంథా ఉత్తర వాయువ్య దిశగా ఏపీ, తెలంగాణ, చత్తీస్ ఘడ్ మీదుగా ప్రయాణించి మరింత వాయుగుండంగా బలహీనపడే అవకాశాలున్నట్లు ఐఎండీ తెలిపింది. తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. నదీ తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లొద్దని , వాగులు, చెరువులు, కాల్వలు, నదీ సమీప ప్రాంతాల్లో తిరగొద్దని ఐఎండీ హెచ్చరించింది. అత్యవసరమైతేనే ఇళ్ల నుండి బయటకు రావాలని, తుఫాన్ ప్రభావం తగ్గేవరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించింది.

హన్మకొండలో రికార్డు స్థాయిలో వర్షం:

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో 41.2 సెం.మీల వర్షాపాతం నమోదైంది.

Next Story