'నిర్మలా సీతారామన్‌ది వార్డు మెంబర్ స్థాయి కూడా కాదు'

by Disha Web Desk 2 |
నిర్మలా సీతారామన్‌ది వార్డు మెంబర్ స్థాయి కూడా కాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిర్మలా సీతారామన్​కేంద్ర మంత్రే అయినా, ఆమెకు వార్డు మెంబర్ స్థాయి కూడా లేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డితో కలసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. నిర్మలా సీతారామన్ తెలంగాణకు వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ఆర్థిక మంత్రి మన రాష్ట్రానికి వస్తున్నారంటే ఎన్నో నిధులు ఇస్తారని ఊహించామని, కానీ, ఆమె ప్రజలకు అవాస్తవాలు నూరిపోయడం విచిత్రంగా ఉన్నదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్మలా సీతారామన్ పచ్చి వ్యతిరేకి అన్నారు. జీడీపీ, తలసరి ఆదాయాల్లో దేశంతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో తెలంగాణ ఉన్నదన్నారు. ఆర్థిక పరిస్థితిపై తాను చెప్పింది ఏదైనా తప్పు ఉంటే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. డీపీఆర్ అంటే నిర్మలా సీతారామన్‌కు తెలియదని, ఎందుకంటే ఒక్క ప్రాజెక్టు బీజేపీ కట్టలేదని ఎద్దేవా చేశారు. డిటైల్ ప్రాజెక్టు రిపోర్ట్‌ను, డ్రాఫ్ట్ ప్రాజెక్టు రిపోర్ట్ అని నిర్మలా అనడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు.

కేంద్రమంత్రిగా ఉండి, వార్డు మెంబర్ స్థాయిలో నిర్మలా సీతారామన్ ప్రవర్తన ఉన్నదన్నారు. రేషన్​షాపుల్లో నెహ్రూ నుంచి మన్మోహన్ వరకు ఎప్పుడూ ప్రధాని మంత్రి ఫోటో పెట్టలేదన్నారు. ఇక రైతుబంధు సరిగ్గా రావడం లేదని ఒక్క రైతైనా చెప్పారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎం కిసాన్‌కు 8 ఏళ్లలో కేంద్రం కేవలం రూ.7వేల కోట్లు ఇవ్వగా, 8 ఏళ్లలో టీఆర్ఎస్​ప్రభుత్వం రైతుబంధు కోసం ఏకంగా 58 వేల కోట్లను ఖర్చు చేసిందన్నారు. 2014లో 13 వందల మంది రైతుల ఆత్మహత్యలు ఉంటే, ప్రస్తుతం 3 వందలకు తగ్గిందని పార్లమెంట్​సాక్షిగా కేంద్రం చెప్పినట్లు గుర్తుచేశారు. కానీ, నిర్మలా సీతారామన్ కేంద్రం అధికారిక రికార్డులు పక్కన పెట్టి సిగ్గులేకుండా అబద్ధాలు చెప్పాడం విచిత్రంగా ఉన్నదన్నారు. ఎరువుల ధరలు పెంచింది కేంద్రమేనని, ఋణమాఫీలు ఒకేసారి చేస్తాం అని మేము ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఆర్థిక పరిజ్ఞానం లేని నిర్మలా సీతారామన్ ఆర్థికమంత్రిగా పనికిరారని, వెంటనే ఆమె రాజీనామా చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.

Next Story

Most Viewed