రాష్ట్ర అధికారిక చిహ్నంపై ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ

by Satheesh |   (  Updated:2024-05-31 16:31:30  IST  )

‘ఆంధ్రా’ అనే పదంపై బీఆర్ఎస్ మళ్లీ విషం చిమ్ముతున్నదని ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్​కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

రాష్ట్ర అధికారిక చిహ్నంపై ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ఆంధ్రా’ అనే పదంపై బీఆర్ఎస్ మళ్లీ విషం చిమ్ముతున్నదని ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్​కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తెరమీదకు మళ్లీ సెంటిమెంట్ ను తీసుకువస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అండ్ టీమ్ వ్యవహరించే కులోక్తులకు ప్రజలెవ్వరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలు, ఉద్యమకారులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ వాదులు కోరుకునే దిశగా పాలన సాగుతుంటే, కేసీఆర్ కుటుంబ హంగామా చేస్తుందన్నారు.

తెలంగాణ చిహ్నంలో ఉద్యమకారుల అభిప్రాయాల మేరకు మార్పులు జరుగుతున్నాయన్నారు. కానీ బీఆర్ఎస్ నేతలకు నొప్పి ఎందుకు? అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర చిహ్నంలో అమర వీరుల స్థూపం ఉంటే తప్పేమిటీ? అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ తప్పిదాలన్నీ వెలికితీస్తామని హెచ్చరించారు. చిన్న జీయర్ స్వామికి పెద్దపీఠ వేసినప్పుడు తెలంగాణ వాదం వినిపించలేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కళలకు, కళాకారులకు ప్రాంతాలు, భాషలతో సంబంధం ఉండదని నొక్కి చెప్పారు. రోజా ఇంట్లో రోయ్యల పులుసు తిన్నప్పుడు నీ సోయి ఎక్కడికి వెళ్లింది అంటూ మండిపడ్డారు.

రాచరిక గుర్తులు లేపేశాం: మల్లు రవి

టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి మాట్లాడుతూ.. 2023 ఎన్నికల కంటే ముందే పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ప్రజల ముందు ఓ ఏజెండా పెట్టారని, దాన్ని రాష్ట్ర ప్రజలంతా ఆహ్వానించారన్నారు. రాచరిక పాలన తీసి ప్రజా పాలన తీసుకోస్తానని ఇచ్చిన మాటను నెరవేర్చుతున్నాడన్నారు. అందులో భాగంగా రాచరిక చిహ్నాలను తీసేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. ప్రజా పాలనలో భాగం గానే జయజయ హే తెలంగాణా పాటని అధికారిక గీతం చేశామన్నారు. ప్రజా చిహ్నం లో అమరవీరుల త్యాగాలకు చోటు దక్కడం సంతోషకరమన్నారు. హిస్టరీ తెలియని వాళ్ళు పాలనకు అనర్హులు అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో స్పోక్స్ పర్సన్స్ చరణ్​ కౌశిక్, భవానీ రెడ్డి, పున్నా కైలాస్ నేత, ఇందిరాశోభన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story