- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశానికి కమ్యూనిస్టులు అవసరం ఏర్పడింది: గోరటి వెంకన్న
ప్రజలను చైతన్యపర్చడంలో కళలదే కీలక పాత్ర అని సినీనటుడు, మహాసభల ఆహ్వాన సంఘం చైర్మెన్ డాక్టర్ మాదాల రవి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలను చైతన్యపర్చడంలో కళలదే కీలక పాత్ర అని సినీనటుడు, మహాసభల ఆహ్వాన సంఘం చైర్మెన్ డాక్టర్ మాదాల రవి అన్నారు. మనిషి శరీరానికి వచ్చిన జబ్బులను తగ్గించడంలో డాక్టర్ల పాత్ర కీలకమనీ, సమాజానికి పట్టిన జబ్బును పోగొట్టేది కళాకారుడే అని కొనియడారు. బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రజానాట్యమండలి రాష్ట్ర మూడో మహాసభలను పీఎన్‌ఎం సీనియర్ నేత నర్సయ్య జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం జరిగిన ప్రారంభ సభలో మాదాల రవి అధ్యక్ష ఉపన్యాసం చేశారు. ప్రపంచంలోనే గొప్ప పోరాటంగా ప్రసిద్ధి చెందిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మట్టిమనుషులను పులులుగా మార్చి పోరుబాట పట్టించడంలో మా భూమి నాటకం పోషించిన పాత్రను గుర్తుచేశారు. సినీరంగంలో ఎంతోమంది నిలదొక్కుకునే అవకాశం కల్పించిన వారిలో పీఎన్‌ఎం వ్యవస్థాపక అధ్యక్షులు గరికపాటి రాజారావు ఒకరనీ, సినీరంగంలోని అల్లూరి రామలింగయ్య, జమున, కేఎస్.ప్రకాశ్, మిక్కిలినేని, ఇలా ఎందరో కళాకారులు పీఎన్‌ఎం నుంచి వచ్చినవారేనని వివరించారు. వందేళ్ల సినీరంగ చరిత్రలో విలువలతో కూడిన గొప్ప సినిమాలు రావడంలో పీఎన్‌ఎం పాత్ర కీలకమని నొక్కి చెప్పారు. కొన్ని పార్టీలు రాష్ట్రాలకు, జాతీయస్థాయికి మాత్రమే పరిమితం కాగా కమ్యూనిస్టు పార్టీ 140కిపైగా దేశాల్లో ఉన్నదనీ, మార్క్సిజం గొప్ప సిద్ధాంతం అని కొనియాడారు.
సుందరయ్య ప్రస్తావన..
దేశం కోసం ఉరికంభం ఎక్కిన భగత్‌సింగ్, బడుగు జీవితాల కోసం నిరంతరం ఆలోచించిన అంబేద్కర్, పేదల పక్షాన నిలబడ్డ సుందరయ్య లాంటి మహనీయులు నిజమైన హీరోలని కొనియాడారు. సంపద అందరిదనీ, కానీ, ప్రస్తుత సమాజంలో కేవలం ఐదు శాతం మంది చేతుల్లో కేంద్రీకృతం అవుతున్న తీరును వివరించారు. నేడు మన దేశంలో విద్య, వైద్యం పూర్తిగా వ్యాపారమయం కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పైసా ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం అందిననాడే మన దేశం అభివృద్ధిలో ముందుకెళ్తుందని నొక్కి చెప్పారు. ఉచిత విద్య, వైద్యం కోసం పాలకులపై పోరాటం చేసేందుకు దోహదపడేలా పీఎన్‌ఎం కళారూపాలుండాలని ఆకాంక్షించారు. ఒక్కో నియోజకవర్గంలో వంద కోట్లరూపాయలు, రూ.70 కోట్లు ఖర్చుపెట్టి గెలిచిన ఎంపీలు, ఎమ్మేల్యేలు ప్రజల కోసం ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. పైసా ఖర్చుపెట్టకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచిన నాడే మన దేశం ముందుకెళ్తుందనీ, లేదంటే సంపద మొత్తం కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం అవుతుందని హెచ్చరించారు. డబ్బు రాజకీయాలను దూరం చేసేలా, ప్రజా సేవకులను గెలిపించేలా పీఎన్‌ఎం కళాకారులు కృషి చేయాలని కోరారు. శత్రువు బలంగా ఉన్న నేపథ్యంలో అభ్యుదయ శక్తులు, వామపక్ష శక్తులు ఐక్యం కావాల్సిన ఆవశ్యకతను, ప్రజాకళలు బలపడాల్సిన అవసరాన్ని విడమర్చి చెప్పారు.
విలువలకు నిలువుటద్ధం పీఎన్‌ఎం కళాకారులు: ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
వాగ్గేయ కళాకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ.. తాను ఈ స్థాయి ఎదగడానికి కమ్యూనిస్టు ఉద్యమమే కారణమని చెప్పారు. సమాజంలో గొప్ప గొప్ప అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని కాదని ప్రజల కోసం, విలువల కోసం ప్రజానాట్యమండలినే నమ్ముకుని ఉన్న కళాకారులకు ధన్యవాదాలు తెలిపారు. విలువలున్న గాంధీ, సుందరయ్య, అంబేద్కర్ లాంటి నేతలు నేడు కరువయ్యారని వాపోయారు. మనుషులను మార్కెట్‌కు బానిసలుగా మార్చి సమాజాన్ని కులం, మతం పేరుతో విభజన రాజకీయాలు చేస్తున్న శక్తుల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. విలువలను హననం చేసి మనుషులను క్రూరంగా తయారు చేస్తున్న ప్రమాదకర స్థితిని ఎత్తిచూపారు. దోపిడీకి కరుణ ఉండదనీ, దాని లాభార్జనే ముఖ్యమని చెప్పారు. ఇలాంటి తరుణంలో కమ్యూనిస్టులు బలపడాల్సిన అవసరముందని ఆకాంక్షించారు. 40 ఏండ్లుగా ఒకే సిద్ధాంతం పట్ల కలిసికట్టుగా ఉంటున్న గంగదేవిపల్లి, పైసా ఖర్చుపెట్టకుండా సర్పంచిగా గెలిపించిన మునిపంపుల గ్రామాల్లోని బలమైన పునాది వ్యవస్థను మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని కోరారు. మనం నెమ్మదిగా గెలుస్తున్నామనీ, మన గెలుపు శత్రువులకు భయం పుట్టిస్తున్నదనీ, అందుకే అణచివేతలు, దాడులు పెరుగుతున్నాయని చెప్పారు. ఆ ఆటలు ఎల్లకాలం చెల్లుబాటు కావనీ, పెరుగుట విరగటం కోసమేనని చెప్పారు. అంతిమంగా ప్రజలే యుగకర్తలనీ, ప్రజా కళలు వర్థిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త పీఏ.దేవి, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, ప్రజానాట్యమండలి తెలంగాణ మాజీ అధ్యక్షులు కె.దేవేంద్ర, పీఎన్‌ఎం రాష్ట్ర అధ్యక్షులు వేముల ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ ప్రారంభ సభలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ, నవతెలంగాణ ఎడిటర్ రాంపల్లి రమేశ్, పీఎన్‌ఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు, నాటక రచయిత కె.శాంతారావు, మహాసభ ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్.మారన్న, ప్రజానాట్యమండలి ఏపీ అధ్యక్ష, కార్యదర్శులు మంగరాజు, అనిల్, మహారాష్ట్ర షోలాపూర్ టీమ్ లీడర్ రఘు, పీఎన్‌ఎం ఆఫీస్ బేరర్లు, తదితరులు పాల్గొన్నారు.






