- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటుగాళ్ల వలలో ఎమ్మెల్యేలు, అధికారులు.. రాష్ట్రంలో విపరీతంగా పెరుగుతున్న సైబర్ నేరాలు
తెలంగాణలో సైబర్ నేరాలు పెను ముప్పుగా మారుతున్నాయి. గత నాలుగేళ్లలో సైబర్ కేటుగాళ్లు రూ. 4,724 కోట్లు దోచుకున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: డిజిటల్ కరెన్సీ వాడకం విపరీతంగా పెరిగింది. దానితోపాటే సైబర్ నేరగాళ్లకు దోపిడీ ఈజీ అయ్యింది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం.. ఇలా రకరకాల యాప్స్ వాడుతున్న ప్రజలంతా డేంజర్ జోన్ లోనే ఉన్నట్లు కనిపిస్తున్నది. వాట్సాప్, మెయిల్, ట్విట్టర్, ఫేస్ బుక్, థ్రెడ్స్ వంటి సోషల్ మీడియా అకౌంట్స్ కి గుర్తు తెలియని లింక్స్ వస్తున్నాయి. వాటిని క్లిక్ చేస్తే చాలు.. అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ మాయమవుతున్నాయి. ఇది కేవలం నిరక్షరాస్యులకే పరిమితం కాలేదు. రోజూ స్మార్ట్ ఫోన్ వాడే విద్యావంతులు, ప్రముఖులు సైతం సైబర్ కేటుగాళ్ల వలలో పడి బలవుతున్నారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ రోజుకో తీరున పోస్టర్ రిలీజ్ అలర్ట్స్ పంపిస్తున్నారు. కానీ నేరగాళ్లు ప్రతి రోజూ కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నారు. తలుపులు బద్దలు కొట్టే పని లేకుండానే డిజిటల్ దొంగలు అదృశ్యంగా దోచేస్తున్నారు. ఏది క్లిక్ చేయకపోయినా.. నా అకౌంట్లో డబ్బులు మాయమయ్యాయంటూ గగ్గోలు పెట్టే బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నది.
లెక్కలు వింటే.. వామ్మో అనాల్సిందే..
2022 నుంచి 2026 వరకు రాష్ట్రంలో వచ్చిన సైబర్ నేరాల ఫిర్యాదులు, నమోదైన కేసులు, బాధితులు, పోగొట్టుకున్న డబ్బులు, రికవరీ, పెండింగ్ అమౌంట్ వంటి వివరాలను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి సేకరించారు. ఈ లెక్కలు వింటే వామ్మో అనాల్సిందే. 2022 నుంచి 2026 ఫిబ్రవరి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షలకు పైగా ఫిర్యాదులు రాగా, 76,048 కేసులు నమోదయ్యాయి. ఏకంగా రూ.4,724 కోట్లు దోచుకున్నారు. ఇంకా ఫిర్యాదు చేయని బాధితులు లక్షల్లో ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. న్యూడ్ ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తే మోసపోయి సమర్పించుకున్న సొమ్ము ఇంకెన్ని రూ.కోట్లు ఉంటుందో అంచనా వేయడం కష్టమే. రిటైర్డ్ ఉద్యోగులు, అధికారులే కాదు.. ఆఖరికి ఎమ్మెల్యేలు కూడా డబ్బులు సమర్పించుకుంటున్నారు. అయితే రూ.వేలల్లో పోగొట్టుకున్న వారు ఫిర్యాదు చేసి ఇజ్జత్ పోగొట్టుకోవడం ఎందుకని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం లేదనే చర్చ జరుగుతున్నది.
పట్టణ ప్రాంతాల్లోనే అధికం
డిజిటల్ చెల్లింపులు పల్లె, పట్నం అనే తేడా లేకుండా అంతటా విస్తరించాయి. చిన్న కరివేపాకు కట్ట కొన్నా డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. ఆఖరికి గుడి దగ్గర యాచకులు సైతం క్యూ ఆర్ కోడ్ పట్టుకొని కూర్చుంటున్నారు. అయితే రాష్ట్రంలో నమోదైన సైబర్ నేరాల్లో అత్యధికం పట్టణాల్లోనే జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదు కావడం గమనార్హం. మొబైల్ వాడకం పెరుగుతున్నా కొద్దీ నేరాలకు ఆస్కారం పెరుగుతున్నట్లు చర్చ జరుగుతున్నది. దీంతో ఇలాంటి మోసాలను అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం సోషల్ మీడియా అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ప్రజలకు అవగాహన కల్పించాలి
సోషల్ మీడియా, టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ సైబర్ మోసాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. సైబర్ కేటుగాళ్లు అమాయక ప్రజలను మోసం చేయడానికి కొత్త కొత్త పద్ధతులు అవలంభిస్తున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వాడుకుంటున్నారు. రూ.లక్షలు, రూ.కోట్లు దోచుకుంటున్నారు. బాధితులు సర్వం కొల్పోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో సైబర్ మోసాలపై కొంత మంది శిక్షకులను ఏర్పాటు చేసి నిరంతరం అవగాహన కల్పిస్తూ ఉండాలి. ప్రభుత్వాలు అంతా టెక్నాలజీ, పేపర్ లెస్ మనీ తేవాలి అంటున్నారు. అలాంటప్పుడు సైబర్ మోసాలను ఆదిలోనే అరికట్టకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు దాచుకున్న డబ్బులకు రక్షణ కరువవుతుంది.
-రాజేంద్ర పల్నాటి, ఫౌండర్, యూత్ ఫర్ యాంటీ కరప్షన్






