ప్రమాదంలో MLA రాజాసింగ్.. భార్య ఉష సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
ప్రమాదంలో MLA రాజాసింగ్.. భార్య ఉష సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయి చంచల్ గూడ జైల్లో ఉన్న ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో ఆయన భార్య ఉష సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో తన భర్త ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పరిణామం ఇప్పుడు రాజకీయా వర్గాల్లో హాట్ టాపిక్‌‌గా మారింది. తన భర్తపై లేనిపోని ఆరోపణలతో పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారని తనకు న్యాయం చేయాలని ఇప్పటికే రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను కలిసిన ఉష గురువారం హైకోర్టును ఆశ్రయించారు. తన భర్త ప్రాణాలకు ప్రమాదం ఉందని అందువల్ల ఇతర ఖైదీలకు దూరంగా ఉంచాలని తన పిటిషన్‌లో కోరారు. తన భర్తను ప్రత్యేక తరగతి ఖైదీగా గుర్తించి వసతులు కల్పించాలని పిటిషన్‌లో కోరారు. రాజాసింగ్‌కు ప్రత్యేక గది, మంచం, టేబుల్, కుర్చీ, వార్త పత్రికలు, టీవీ, వంట చేసుకోవడానికి తగిన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కన్నెగంటి లలిత విచారణ చేపట్టారు. అయితే వాదనలు వినిపించడానికి గడువు కావాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరడంతో విచారణను 28కి వాయిదా వేశారు.

రాజాసింగ్ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారనే వార్తలు వస్తునప్పటికీ ఆయన భార్య ఈ రకమైన ఆందోళన వ్యక్తం చేయడం రాజాసింగ్ అభిమానుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. మరో వైపు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టిన నాలుగో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగింపు సభలో రాజాసింగ్‌ను విడుదల చేయాలని నినాదాలు వినిపించాయి. పలువురు కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేయడంతో సభలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో బండి సంజయ్ జోక్యం చేసుకుని ఏం చేయాలో తమకు తెలుసని జరగాల్సింది జరిగి తీరుతుందన్నారు. తమకు జైలుకు పోవడం కొత్తేమీ కాదని ధర్మం కోసం జైలుకు పోవడానికైనా వెనుకడుగు వేయబోమని చెప్పారు. అయితే వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రాజాసింగ్‌ను బీజేపీ సస్పెండ్ చేసింది. అయినప్పటికీ ఆయన కోసం బీజేపీ సభలో నినాదాలు వినిపించడం హాట్ టాపిక్ అయింది. రాజాసింగ్ విషయంలో బీజేపీ లైట్ తీసుకుంటే రాబోయే రోజుల్లో ఆయన అభిమానులు పార్టీ ప్రతి సభలోనూ నినాదాలు నిరసనలు వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. రాజాసింగ్ అరెస్ట్ సమయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రంలోని ఆయా జిల్లాలో ఆందోళనలు కొనసాగిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చ‌ద‌వండి

TS: 31 మంది డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతి..అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్


Next Story

Most Viewed