- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనసేనలోకి రాజాసింగ్?.. గ్రేటర్‌లో హాట్ హాట్‌గా చర్చ!
బీజేపీ రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ జనసేన పార్టీలో చేరబోతున్నారనే వార్త ఇప్పుడు గ్రేటర్ రాజకీయాల్లో హాట్ హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, హైదరాబాద్ బ్యూరో: బీజేపీ రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ జనసేన పార్టీలో చేరబోతున్నారనే వార్త ఇప్పుడు గ్రేటర్ రాజకీయాల్లో హాట్ హాట్ టాపిక్‌గా మారింది. గోషామహల్ నుండి హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఆయనను ఇటీవల బీజేపీ నుండి బహిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో రాజాసింగ్ ఏం చేయబోతున్నారనేది రాజకీయ వర్గాలలో ఆసక్తిగా మారింది. బీజేపీ నుండి ఆయనను బహిష్కరించడం తిరిగి పార్టీలోకి తీసుకోవడం పరిపాటిగా మారింది. ఈ పర్యాయం ఏకంగా బీజేపీ ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హున్ని చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరగడంతో ఆయన ప్రత్యామ్నాయంగా జనసేన వైపు దృష్టి పెట్టారని ఆయన అనుచరులు అంటున్నారు. ఒకప్పుడు టీడీపీ నుండి రాజకీయరంగ ప్రవేశం చేసిన రాజాసింగ్‌కు ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఉండడం తనకు అనుకూలంగా మలుచుకునే ఆలోచనలో ఉన్నారట. జనసేనలో చేరడం ద్వారా టీడీపీ తద్వారా బీజేపీ మద్దతు కూడగట్టుకుని నాల్గోసారి ఎమ్మెల్యేగా గెలవాలనే ఆలోచనలో రాజాసింగ్ ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? జనసేనలో చేరతారా? లేక సొంత పార్టీ పెడతారా అనేది ఇప్పడు గ్రేటర్‌లో చర్చనీయాంశంగా మారింది.
టీడీపీతో రాజకీయాలలోకి...
2018 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నుండి గెలిచి అసెంబ్లీలో ఆ పార్టీ ప్రతినిధిగా ఒకే ఒక్కడుగా ఉన్న రాజాసింగ్ రాజకీయ ప్రస్థానం టీడీపీతో మొదలైంది. మంగళ్ హాట్ కార్పొరేటర్‌గా గెలిచిన రాజాసింగ్ అనంతరం బీజేపీలో చేరి మూడు పర్యాయాలు గోషామహల్ సెగ్మెంట్ నుండి విజయం సాధించారు. అయితే హిందూ భావజాలంతో నరనరాన జీర్ణించుకున్న ఆయన ఓ వర్గాన్ని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేయడం, వీడియోలు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టులు చేయడం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇదే ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచగా అదే ఆయనకు మైనస్‌గా కూడా మారింది. 2022 ఆగస్టులో హాస్య నటుడు మునావర్ ఫారూఖీ హైదరాబాద్ నగరంలో నిర్వహించిన షో సందర్భంగా ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జాతీయ స్థాయిలో చర్చలకు కారణమై బీజేపీ నుండి బహిష్కరణకు గురయ్యారు. అయితే సస్పెండ్ అయిన రాజాసింగ్‌పై 2023 అసెంబ్లీ టిక్కెట్లు ప్రకటించేంత వరకు నిషేదం ఎత్తి వేయలేదు. దీంతో ఆయన అప్పట్లోనే పార్టీ మారతారనే ప్రచారం జరిగినప్పటికీ చివరి నిమిషంలో బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వడం, మూడోసారి ఆయన విజయం సాధించడం జరిగిపోయాయి. తాజాగా ఆయన పార్టీ అసంతృప్తితో రాజీనామా చేయడంతో జనసేనలో చేరుతారనే వార్తలు విస్తృతం అయ్యాయి. దీనిపై ఆయన స్పందించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.






