గత కొంతకాలంగా అసంతృప్తి.. ఇప్పుడు నేరుగా సీఎంతో భేటీ: హాట్ టాపిక్‌గా రాజగోపాల్ రెడ్డి

by Gantepaka Srikanth |

తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

గత కొంతకాలంగా అసంతృప్తి.. ఇప్పుడు నేరుగా సీఎంతో భేటీ: హాట్ టాపిక్‌గా రాజగోపాల్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ కౌన్సిల్ హాల్‌లోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో సీఎం రేవంత్ రెడ్డితో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారు పది నిమిషాల పాటు సాగిన ఈ 'వన్-టు-వన్' భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా రాజగోపాల్ రెడ్డి పార్టీ తీరుపై లేదా ప్రభుత్వ నిర్ణయాలపై కొంత అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన నేరుగా ముఖ్యమంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పది నిమిషాల పాటు కేవలం వీరిద్దరి మధ్యే వ్యక్తిగత సంభాషణ జరగడం చూస్తుంటే, తన నియోజకవర్గ సమస్యలతో పాటు రాజకీయ సమీకరణాలపై కూడా చర్చించి ఉంటారని భావిస్తున్నారు.

క్లారిటీ కోసమేనా?

పార్టీలో తన ప్రాధాన్యత లేదా రాబోయే రోజుల్లో చేపట్టబోయే బాధ్యతలపై సీఎం నుంచి ఆయన స్పష్టత కోరి ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ భేటీకి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ, రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిని చల్లార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నించారా? లేక మరేదైనా వ్యూహాత్మక చర్చ జరిగిందా? అన్నది వేచి చూడాలి.

Next Story