హిల్ట్ పాలసీ ల్యాండ్ లూటీ స్కాం అని రుజువు చేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్

by Ajay Maddhiboyina |

హిల్ట్ పాలసీ ల్యాండ్ లూటీ స్కామ్ అని రుజువు చేయకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను.. సవాలుకు మంత్రులు, సీఎం సిద్దమా? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికే కాదు .. దుష్టచ‌తుష్టయ‌మైన క్యాబినెట్ స‌బ్ క‌మిటీ మంత్రుల‌కు సవాల్ చేస్తున్న..

హిల్ట్ పాలసీ ల్యాండ్ లూటీ స్కాం అని రుజువు చేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో : హిల్ట్ పాలసీ ల్యాండ్ లూటీ స్కామ్ అని రుజువు చేయకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను.. సవాలుకు మంత్రులు, సీఎం సిద్దమా? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికే కాదు .. దుష్టచ‌తుష్టయ‌మైన క్యాబినెట్ స‌బ్ క‌మిటీ మంత్రుల‌కు సవాల్ చేస్తున్న.. వారు న‌లుగురు క‌లిసి వ‌చ్చినా స‌రే, విడి విడిగా వ‌చ్చినా స‌రే, ఎక్కడైనా స‌రే, ఎప్పుడైనా స‌రే బ‌హిరంగ చ‌ర్చకు సిద్దమని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు. హిల్ట్ పాల‌సీ ఆరు లక్షల కోట్ల రూపాయల అవినీతికి ఆస్కార‌మున్న ల్యాండ్ లూటీ స్కామ్ అని రుజువు చేస్తాను, రుజువు చేయ‌లేక‌పోతే రాజ‌కీయ స‌న్యాసం స్వీక‌రిస్తానన్నారు. భారీ ల్యాండ్ లూటీ స్కామ్ అని రుజువు చేస్తే దుష్టచ‌తుష్టయంతో పాటు ల్యాండ్ లూటీ మాఫియా డాన్ లా వ్యవ‌హ‌రిస్తున్న రేవంత్ రెడ్డి కూడా సీఎం ప‌ద‌వికి రిజైన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హిల్ట్‌ పాలసీపై అసెంబ్లీ మీడియా పాయింట్ కి చర్చకు రావాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి సవాల్‌ విసిరిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పూర్తి ఆధారాలతో శనివారం పలు ఫైల్స్‌తో అసెంబ్లీ మీడియా పాయింట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా చర్చల కోసం ఏర్పాట్లు చేసి మంత్రి కోసం నిరీక్షించారు. మంత్రల పేర్లు ఉన్న చైర్లు ఏర్పాటు చేసి వారి కోసం ఆయన నిరీక్షించారు. ఈ సందర్భంగా కొంత సేపు అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది. ఆ తర్వాత అసెంబ్లీ సిబ్బంది ఆ చైర్లను తొలగించారు. ఉత్తమ్‌, భట్టి ఎప్పుడు వస్తారో కనుక్కొని చెప్పాలని సిబ్బందికి చెప్పగా.. తమకు సంబంధం లేదని చెప్పి వెళ్లిపోయారు.

అనంతరం ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కోకాపేటలో ఎకరం ధర రూ.151 కోట్లు.. మరి పారిశ్రామిక వాడల్లో భూముల ధర రూ.54 లక్షలా? కోకాపేటలోని భూములకు హెచ్ఎండీఏ శుక్రవారం రెండో విడత నిర్వహించిన‌ వేలంలో ఎకరానికి రూ.151 కోట్ల ధర పలికింది.. మొన్న ఎక‌రం ధ‌ర రూ.137కోట్లు.. ఈ లెక్కన హిల్ట్ పాల‌సీలో భాగంగా 22 పారిశ్రామిక వాడ‌ల్లో ఉన్న భూముల ధ‌ర స‌గ‌టున ఎక‌రం సుమారు రూ.68 కోట్లుగా ఉంటుంద‌ని అంచ‌నా.. ఆ మేర‌కు ప్రభుత్వం క‌న్వర్షన్ చేస్తున్న 9292 ఎక‌రాలకు మార్కెట్ ధ‌ర ప్రకారం వ‌చ్చే మొత్తం రూ.ఆరు ల‌క్షల 29 వేల కోట్లు.. ఈ లెక్కలు త‌ప్పని మంత్రి ఉత్తమ్ చెప్పద‌ల‌చుకున్నారా? అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ భూములను ఎకరం రూ.54 లక్షలకే ఇచ్చేయడం లూటీ కాక మరేమిటి? రూ.ఆరు ల‌క్షల 29 వేల కోట్ల కుంభ‌కోణంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో స‌హా మొత్తం క్యాబినెటుకు, కాంగ్రెస్ హైక‌మాండ్ పెద్దల‌కు భాగ‌స్వామ్యం ఉంది.. రూ.ఆరు లక్షల 29 వేల కోట్ల స్కాంలో రూ.మూడు ల‌క్షల 30 వేల కోట్లు రేవంత్ రెడ్డికి, క్యాబినెట్ స‌బ్ క‌మిటీ మంత్రులు న‌లుగురికి రూ.15 వేల కోట్ల చొప్పున రూ.60వేల కోట్లు, మిగిలిన 11 మంది మంత్రుల‌కు రూ.10వేల కోట్ల చొప్పున వారికి రూ.ల‌క్ష 10 వేల‌ కోట్లు.. కాంగ్రెస్ హైక‌మాండ్ నేత‌లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల‌కు చెరో రూ.50వేల కోట్ల చొప్పున రూ.ల‌క్ష కోట్లు.. మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేకు రూ.30 వేల కోట్లు ముట్టనున్నాయని మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఇండస్ట్రియల్ ల్యాండ్ స్కాం కాంగ్రెస్ సర్కారుకు ఆదర్శమా?.. హిల్ట్ పాల‌సీపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే చర్చ జరిగిందంటున్న మంత్రి ఉత్తమ్ ... వారి హాయంలో జ‌రిగిన అవినీతిని, అక్రమాల‌ను ఆద‌ర్శంగా తీసుకుంటున్నారా ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ భూ బాగోతాన్ని రాష్ట్ర మంత్రులు ఎందుకు బయట పెట్టడం లేదు? గత ప్రభుత్వ త‌ప్పిదాల‌ను బ‌య‌ట పెడుతామ‌ని భ‌ట్టి విక్రమార్క, శ్రీధ‌ర్ బాబు మాట్లాడారు క‌దా.. మ‌రి ఎందుక‌ని బ‌య‌ట‌పెట్టడం లేదు.. బీఆర్ఎస్ తో మీకున్న మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటి? అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. హిల్ట్ పాలసీ ప్రతిప‌క్షాల‌కు అర్ధం కాలేద‌న్న ఉత్తమ్ కుమార్ రెడ్డిది దివాళాకోరుత‌నానికి నిద‌ర్శనమని, దీనిపై చ‌ర్చించేందుకు అసెంబ్లీ మీడియా పాయింట్​కు ర‌మ్మని తాను శుక్రవారం చేసిన స‌వాలును మంత్రి ఉత్తమ్ ఎందుకు స్వీక‌రించ‌లేదని, అంటే హిల్ట్ పాల‌సీలో పార‌ద‌ర్శక‌త లేద‌ని రుజువైన‌ట్లే క‌దా అని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. మంత్రి ఉత్తమ్ కి ద‌మ్ముంటే సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి తక్షణ‌మే అసెంబ్లీని స‌మావేశ‌ప‌ర‌చాలని, అసెంబ్లీలో చర్చించిన త‌ర్వాతే హిల్ట్ పాల‌సీని అమ‌లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పాల‌సీని అమ‌లు చేసేందుకు జారీ చేసిన జీవో 27ను త‌క్షణ‌మే ర‌ద్దు చేయాలని, దీని కోసం న్యాయపోరాటం, ప్రజా పోరాటం చేస్తామన్నారు.

రేవంత్ రెడ్డి ల్యాండ్ లూటీ మాఫియా డాన్ లా, మంత్రులు ల్యాండ్ లూటీ గ్యాంగ్ స్టర్లుగా వ్యవ‌హ‌రిస్తున్నారని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. రూ.6.30 లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు రాత్రికి రాత్రే ప్రభుత్వం జీవోను తీసుకువచ్చిందని, అది రుజువు చేసేందుకు అసెంబ్లీలో ఫైల్స్‌కు తీసుకువచ్చానని, దుష్ట చతుష్టయానికి లై డిటెక్టర్‌ టెస్ట్‌ చేస్తే హిల్ట్‌ పాలసీలో నిజాలన్నీ బయటకు వస్తాయని ఆయన తెలిపారు. ఏ ప్రాతిప‌దిక‌న హిల్ట్ పాల‌సీని రూపొందించి రూ.ఆరు ల‌క్షల 29 వేల కోట్ల విలువైన భూముల‌ను రూ.ఐదు వేల కోట్లకు ఎందుకు క‌ట్టబెడ‌తున్నారనే ప్రశ్నకు స‌మాధాన‌మేదీ? అని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. అజామాబాద్‌, కూకట్‌పల్లి, హఫీజ్‌పేటలోని పారిశ్రామిక భూములకు ఫ్రీ హోల్డ్‌ పేరిట బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే యాజమాన్య హక్కులు కల్పించిందని, వంద‌ల కోట్ల ప్రభుత్వ భూముల‌ను అప్పటి మంత్రి కేటిఆర్ త‌న వారికి అప్పనంగా క‌ట్టబెట్టి ప్రజాధ‌నాన్నికొల్లగొట్టార‌ని శ్రీధ‌ర్ బాబు ఆరోపించారు.. బీఆర్ఎస్ అప్పుడు గ్రిడ్ స్కాంకి పాల్పడితే కాంగ్రెస్ ఇప్పుడు హిల్ట్ స్కాంకి స్కెచ్ వేసిందని, నాడు గ్రిడ్ పాల‌సీతో బీఆర్ఎస్ వంద‌ల ఎక‌రాల పారిశ్రామిక భూముల‌ను కొల్లగొడితే, నేడు కాంగ్రెస్ స‌ర్కార్ హిల్ట్ పాల‌సీ ద్వారా ఏకంగా 22 పారిశ్రామిక వాడ‌ల‌నే మింగిస్తోందని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.

ఇండిస్ట్రియ‌ల్ ల్యాండ్ లూటీ ఎపిసోడుకు బీఆర్ఎస్ కిటికీలు తెరిస్తే, కాంగ్రెస్ ఇపుడు త‌లుపులు తెరవ‌డం కాదు, ఏకంగా గోడ‌ల‌నే కూల్చేసిందని, రాష్ట్రంలో గొర్రెల‌ను తినేటోడు పోయి బ‌ర్రెల‌ను తినేటోడు వ‌చ్చిండ‌న్నమాట‌ అని మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ ప‌రిశ్రమ‌ల‌ను మూసేసి వాటి ఓన‌ర్లను ఆ భూముల్లో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోమంటున్నారా? ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వ పారిశ్రామిక విధానం.. పరిశ్రమలను ఫ్యూచర్ సిటీలో రీ లొకేట్ చేయొచ్చు కదా? అని ఆయన సూచించారు. యాభై ఏళ్లుగా ఈ పరిశ్రమలు విడుదల చేస్తున్న రసాయనిక వ్యర్ధాలు భూమిలో ఇంకిపోవడం వల్ల ఈ ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు నిర్మించి నివాసానికి అనుమతిస్తే విషతుల్యమైన భూగర్భ జలాలతో అక్కడ నిర్మించే అపార్ట్మెంట్లలో నివసించే ప్రజలకు అనారోగ్య సమస్యలు రావా? ఇలాంటి అంశాలపై లోతైన అధ్యయనం ప్రభుత్వం ఏమైనా చేసిందా? ఎలాంటి ఎన్విరాన్మెంటల్ స్టడీ చేయకుండా కాలుష్యకారక పరిశ్రమల స్థానంలో నివాసాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుంది.. ఇది ప్రజారోగ్యంతో చెలగాటం కాదా? అని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గ్యాంగ్ ముందుగానే 22 పారిశ్రామిక‌వాడ‌ల్లో రెక్కీ నిర్వహించి, అక్కడున్న సంస్ధల‌కు చెందిన వారితో అగ్రిమెంట్లు కుదుర్చుకున్న త‌ర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి హిల్ట్ పాల‌సీని క్యాబినెటులో ఆమోదించారని, ఇది ముమ్మాటికీ ఇది క్విడ్ ప్రో కో స్కాం, ఇన్ సైడర్ ట్రేడింగ్ స్కాం అని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.

Next Story