సంక్రాంతి సంబరాలను గ్రాండ్‌గా నిర్వహించిన ఎమ్మెల్యే దానం నాగేందర్

by Ajay Maddhiboyina |

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంక్రాంతి సంబురాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. మహిళలకు ముగ్గుల పోటీలు..పతంగుల పండుగను ఘనంగా రెండు రోజుల పాటు నిర్వహించారు.

సంక్రాంతి సంబరాలను గ్రాండ్‌గా నిర్వహించిన ఎమ్మెల్యే దానం నాగేందర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంక్రాంతి సంబురాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. మహిళలకు ముగ్గుల పోటీలు..పతంగుల పండుగను ఘనంగా రెండు రోజుల పాటు నిర్వహించారు. ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండీ గ్రౌండ్ లో నిర్వహించిన ఈ సంబరాల్లో ముగ్గుల పోటీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు వీరితో పాటు సిటీకి సంబంధించిన కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరయ్యారు. బుధవారం జరిగిన కైట్ ఫెస్టివల్ ను కూడా దానం నాగేందర్ గ్రాండ్ గా నిర్వహించారు. కైట్ ఫెస్టివెల్ లో దానం ఉత్సాహాంగా పతంగులు ఎగురవేసి అక్కడికి వచ్చిన వారిలో ఉత్సాహాం నింపారు. అయితే ఈ సంబరాలతో దానం నాగేందర్ తన నియోజకవర్గంలో తన సత్తాను చాటుకునేలా ఈవెంట్ ను నిర్వహించారన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో జరగుతోంది. ఇప్పటికే దానం నాగేందర్ రాజీనామా అంశం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమ నుంచి కాంగ్రెస్ లోకి పార్టీ మారారు అంటూ పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ స్పీకర్ కి ఫిర్యాదు చేయడం..ఆయన ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం..ఎనిమిది ఎమ్మెల్యేలు స్పీకర్ కి వివరణలు ఇవ్వడంతో వారిపైన స్పీకర్ విచారణ జరపారు.

అనంతరం ఇటీవల ఐదుగురు ఎమ్మెల్యేలపైన దాఖలైన పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. ఇక మిగిలిన ఎమ్మెల్యేలలో ముగ్గురిపై తీర్పును స్పీకర్ ఇవ్వల్సి ఉండగా, ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి ఇటీవల వివరణ ఇచ్చారు. కాగా, దానం నాగేందర్ స్పీకర్ కి ఇచ్చే వివరణపై స్పష్టత లేదు. అయితే దానం నాగేందర్ గత ఎంపీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేశారు. దీనితో ఆయన స్పీకర్ కి వివరణ ఇస్తే అనర్హత వేటు పడుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన అనర్హత వేటు కంటే ముందే రాజీనామా చేసేందుకే మొగ్గు చూపుతున్నారన్న టాక్ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. దీనికి బలం చేకూరుస్తూ ఆయన ఇటీవల ఢీల్లీకి వెళ్లి ఏఐసీసీ పెద్దలను కల్సి తాను రాజీనామా అశం, రాజీనామా చేస్తే అనంతరం ఏర్పడే పరిణామాలు, పార్టీలో తనకు ఇచ్చే ప్రాధాన్యతలపై చర్చించినట్లుగా మీడియాలో ప్రచారం జరిగింది.

దీనికి తోడు ఆయన బీఆర్ఎస్ నేతలపై సమయానుకూలంగా విమర్శలు చేస్తున్నారు. సీఎంపైన, ప్రభుత్వంపైన బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తే ప్రతి విమర్శలను ఆయన గుప్పిస్తుండటంతో ఇక దానం ఎమ్మెల్యే పదవికి రాజీనామాకే సిద్ద పడుతున్నట్లుగా ఆయన వ్యవహారశైలి ఉందనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది. దానం ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తే ఖైరతాబాద్ కి ఉప ఎన్నిక వస్తుంది. ఇటీవలనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. సర్పంచ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గణనీయ సంఖ్యలో సర్పంచ్​లను గెలుచుకున్నది. దీనితో తెలంగాణలో కాంగ్రెస్ కి సానుకూల ఎన్నికల వాతావరణం ఏర్పడిందన్న భావనలో అధికార పార్టీ ఉందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.

ఈ సమయంలో దానం రాజీనామా చేస్తే విజయం సులభం అనే అంచనాలో తమ పార్టీ ఉందని అధికార పార్టీ నేతలు అంటున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికలు ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు రానున్న రోజుల్లో రానున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కీలకం అయినందున ఆ ఎన్నికల తర్వాతే దానం రాజీనామా ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఈ లోగా దానం నియోజకవర్గంలో తన రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతూ ప్రజలకు మరింత దగ్గర అయ్యేందుకు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను స్పీడ్ అప్ చేసే యోచనలో ఉన్నట్లుగా హస్తం నేతలు అంటున్నారు. కాగా, రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లే ధైర్యం తనకుందని, కార్యకర్తల అండతో ఆరుసార్లు గెలిచిన తాను మళ్లీ గెలిచి చూపిస్తానని ఆయన ఇదివరకే సవాల్ విసిరిన నేపథ్యంలో దానం రాజీనామా అంశంపై పొలిటికల్ సర్కిల్స్ ఆసక్తికర చర్చ జరగుతోంది.

Next Story