Miss world 2025: నేడే మిస్ వరల్డ్ ఫైనల్..హాజ‌రుకానున్న బాలీవుడ్ తార‌లు!

by Ajay Maddhiboyina |

అందాల పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి. శనివారం జరిగే మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే వేడుకలకు హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికకానుంది.

Miss world 2025: నేడే మిస్ వరల్డ్ ఫైనల్..హాజ‌రుకానున్న బాలీవుడ్ తార‌లు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: అందాల పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి. శనివారం జరిగే మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే వేడుకలకు హైదరాబాద్ లోని హైటెక్స్ వేదిక కానుంది. గెలిచిన సుందరీమణికి కిరీటధారణ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 72వ మిస్ వరల్డ్ పోటీలు ఫైనల్‌కు చేరాయి. ఈ పోటీలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మొత్తం 108 మంది కంటెస్టెంట్స్‌లో 40 మంది సెమీ ఫైనల్స్ కు చేరుకున్నారు. ఈ కార్యక్రమాన్ని 3500 మంది వీక్షించవచ్చని అంచనా వేస్తున్నారు. టూరిజం వెబ్‌సైట్ ద్వారా ఫైనల్ పోటీలకు వేయి మంది సామాన్య ప్రతినిధులను ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 108 మగువలు వివిధ దేశాల పోటీదారులు అందం, ఉద్దేశం, ఐక్యతను జరుపుకునే ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీపడుతున్నారు. సుమారు 20 రోజుల పాటు జరిగిన వివిధ కార్యక్రమాల్లో వీరంతా పాల్గొని తమ ప్రతిభను చాటడంతో పాటు తెలంగాణలో ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు. ‘తెలంగాణ జరూర్ ఆనా’ అనే నినాదాన్ని విశ్వవ్యాప్తం చేశారు.

బాలీవుడ్ తారల మెరుపులు!

ఈ పోటీలకు మిస్ వరల్డ్ 2016 స్టెఫానీ డెల్ వాలె, భారతీయ ప్రెజెంటర్ సచిన్ కుంభర్ హోస్ట్ లుగా వ్యవహరిస్తారు. బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ ఫైనల్స్ లో స్టేజీపై లైవ్ షో ఇవ్వనున్నారు. ప్రముఖ మానవతావాది, నటుడు సోనూసూద్‌కు మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డు ప్రదానం చేయనున్నారు. ఆయన ఫైనల్స్ కు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరిస్తారు. ఇతర జ్యూరీలుగా సుధారెడ్డి, డాక్టర్ కారినాటర్రెల్ (మిస్ ఇంగ్లాండ్ 2014), మిస్ వరల్డ్ సీఈవో జూలియామోర్లీ ఉన్నారు. మిస్ వరల్డ్ 2017, ప్రముఖ బాలీవుడ్ నటి మనుషిచిల్లర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఈ గ్రాండ్ ఫినాలే కార్యక్రమం భారతదేశంలో సోనీ లివ్‌లో లైవ్ స్ట్రీమ్ అవుతుంది. కొన్ని దేశాల్లో జాతీయ టెలివిజన్‌లో ప్రసారం కానుంది. ప్రపంచవ్యాప్తంగా www.watchmissworld.com ద్వారా హై డెఫినిషన్‌లో అందుబాటులో ఉంటుంది.

అందమే కాదు ప్రతిభకు పట్టం

హైటెక్స్ లో జరిగే వేడుకలకు 108 దేశాల ముద్దుగుమ్మలు ఖండాల వారీగా ర్యాంప్ వాక్ చేయనున్నారు. అనంతరం జడ్జీలు ఎంపికచేసిన 24 మంది వస్తారు. అందులో 20 మంది, ఆ తర్వాత 8 మందిని ఎంపికచేస్తారు. ఇందులో ఒక్కో ఖండం నుంచి ఇద్దరు అందాలభామలు ఉంటారు. వీరిని ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, సమకాలీన అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ఈ విషయంలో ఎవరు అందరినీ మెప్పించే సమాధానం చెబితే వారిలో నుండి నలుగురిని సెలెక్ట్ చేస్తారు. చివరగా ‘మీరు మిస్ వరల్డ్ అయితే ఏం చేస్తారు.’ అనే ప్రశ్నతో పోటీ ఫైనల్ ప్రారంభవుతుంది. అందులో మెప్పించే సమాధానం చెప్పిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఆమెకు 2024 మిస్ వరల్డ్ విజేత క్రిస్టినా పిజ్కోవా అందాల కిరీటాన్ని ధరింపజేస్తుంది. మిస్ వరల్డ్ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన ఫెస్టివల్‌గా ప్రతిఏటా నిలుస్తోంది. కేవలం అందచందాలకే ప్రాముఖ్యత కాకుండా ఈ కార్యక్రమం తెలివితేటలు, సామాజిక న్యాయం, సాంస్కృతిక మార్పిడి, ఉద్దేశం, నాయకత్వ లక్షణాల ద్వారా మహిళా సాధికారతను చేస్తుంది.

తెలంగాణ విశ్వవ్యాప్తం: జయేష్ రంజన్

ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మ్యాగీపై రాష్ట్రప్రభుత్వం చేపట్టిన విచారణ ముగిసినట్లు పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోదని ఆయన స్పష్టం చేశారు. అయితే, మిల్లా మ్యాగీపై యూకే ప్రభుత్వం లీగల్ చర్యలు తీసుకోబోతోందని, మిస్ వరల్డ్ నిర్వాహకులు లండన్ కోర్టులో కేసు వేశారని సమాచారం ఉన్నట్లు తెలిపారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్‌లో జరిగే తేనీటి విందుకు కొత్త మిస్ వరల్డ్ హాజరుకానున్నారని తెలిపారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి మరింత అంతర్జాతీయ గుర్తింపును తీసుకొస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

Next Story