మిస్ వరల్డ్ బ్యూటీస్.. కాళేశ్వరం మీద నోటీసులు.. ఇదే రేవంత్ రాజకీయం: కేటీఆర్

by Ramesh Naini |   (  Updated:2025-05-22 09:57:28  IST  )

కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టుపై కమిషన్ నోటీసుల పేరుతో నీచ రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

మిస్ వరల్డ్ బ్యూటీస్.. కాళేశ్వరం మీద నోటీసులు.. ఇదే రేవంత్ రాజకీయం: కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టుపై కమిషన్ నోటీసుల పేరుతో నీచ రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియా చిట్ చాట్‌లో మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన చేసిన దుష్ప్రచారం తేలిపోయిందని, నిన్నటి సుప్రీంకోర్టు సాక్షిగా నిజాలు బయటకు వచ్చాయని అన్నారు. (Congress) కాంగ్రెస్, బీజేపీ (BJP) కలిసి కాళేశ్వరంపై చేస్తున్న దుష్ప్రచారం కూడా త్వరలో తేలిపోతుందన్నారు. ప్రజాపాలన పర్సంటేజీ పాలనగా మారిందని, దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ నోటీసులు అని ఆరోపించారు. కమీషన్లు బయటపడుతున్నాయనే.. ప్రస్తుతం నోటీసుల పేరిట తమాషాలు చేస్తున్నారని మండిపడ్డారు. జస్టిస్ ఘోష్ తన నివేదిక పూర్తయిందని, విచారణ పూర్తయిందన్నారని చెప్పుకొచ్చారు. అయితే మళ్లీ ఎందుకు పొడిగించారు? ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం నోటీసులు ఇప్పటిదాకా నేరుగా అందినట్లు సమాచారం లేదని, అందిన తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని బ్యారేజీలను కూలగొట్టి మళ్లీ టెండర్లు పిలిచి, 20 నుంచి 30 శాతం కమీషన్లు తీసుకోవాలన్నదే ఈ నోటీసుల అసలు ఎజెండా అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

(CM Revanth Reddy)రేవంత్ రెడ్డిలో అపరిచితుడు ఉన్నాడని, ఆయనకు భయంకరమైన మానసిక వ్యాధి ఉందని విమర్శించారు. 'మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్' అనే మానసిక రుగ్మతతో ఉన్నారని తీవ్ర విమర్శలు చేశారు. అందుకే ఒకే అంశంపై ఆయన రోజుకోలా మాట్లాడతారని అన్నారు. రాష్ట్రంలో 580 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, సీఎం అందాల పోటీలో ఉండటం కరెక్టా? అని ప్రశ్నించారు. అన్నదాతల ధాన్యం వర్షంలో కొట్టుకుపోతుంటే, అందాల పోటీలకు రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద ప్రమాదం జరిగితే ఒక్కసారి పోనీ రేవంత్ రెడ్డి అందాల పోటీలకు నాలుగు సార్లు పోయారని గుర్తుకు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ దగ్గర ఒక రూపాయి కూడా లేదు అని చెప్పి, రెండు వందల కోట్ల రూపాయలు అందాల పోటీలకు ఖర్చు పెట్టడం కరెక్టా? అని నిలదీశారు.

మిస్ వరల్డ్ (Miss World) కాంటెస్టులకు మంత్రులంతా టూర్ గైడ్లుగా మారిపోయారని విమర్శించారు. మంత్రులు సొంగ కార్చుకుంటూ అందాల పోటీలో పాల్గొంటున్నారని సీపీఐ నారాయణ అన్నారని గుర్తుకు చేశారు. మిస్ వరల్డ్ బ్యూటీస్.. కాళేశ్వరం మీద నోటీసులు.. ఇదే రేవంత్ రాజకీయం అని అన్నారు. మిస్ వరల్డ్ బ్యూటీస్‌కి కూడా రేవంత్ రెడ్డి చూపిస్తున్నదంతా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు మాత్రమే అని అన్నారు. నిజాం కట్టిన చార్మినార్ లేదా కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు తప్ప, కాంగ్రెస్ పార్టీ కట్టిన ఒక్కదానినైనా రేవంత్ రెడ్డి చూపించగలడా? అని ప్రశ్నించారు.

Next Story