3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు గనుల శాఖ కీలకం.. చింతన్ శివిర్‌లో మంత్రి వివేక్ వెంకటస్వామి

by Ramesh Naini |

తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించాలనే లక్ష్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్ధేశించారని, ఈ లక్ష్య సాధనలో గనుల రంగం కీలక పాత్ర పోషించనుందని కార్మిక, గనుల శాఖ మంత్రి జీ. వివేక్ వెంకటస్వామి తెలిపారు.

3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు గనుల శాఖ కీలకం.. చింతన్ శివిర్‌లో మంత్రి వివేక్ వెంకటస్వామి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించాలనే లక్ష్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్ధేశించారని, ఈ లక్ష్య సాధనలో గనుల రంగం కీలక పాత్ర పోషించనుందని కార్మిక, గనుల శాఖ మంత్రి జీ. వివేక్ వెంకటస్వామి తెలిపారు. ప్రస్తుతం జాతీయ జీడీపీలో తెలంగాణ రాష్ట్ర వాటా సుమారు 2.4 శాతం ఉందని, దీనిని 5 శాతానికి పెంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ దిశగా తెలంగాణ గనులు శాఖ పలు సంస్కరణలు చేస్తుండటంతో గనుల ఆదాయం 22 శాతం మేర పెరిగిందని ఆయన వెల్లడించారు. శుక్రవారం గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహించిన రాష్ట్రీయ ఖనిజ చింతన్ శివిర్-2026లో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో వివిధ రాష్ట్రాల గనుల మంత్రులు, గనుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పారదర్శకత, స్థిరత్వానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రంలో జీరో అక్రమ గనులు, జీరో అక్రమ రవాణా, జీరో ఓవర్‌లోడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. తాత్కాలికంగా కొన్ని ఒత్తిళ్లు, సవాళ్లు ఎదురైనా, దీర్ఘకాలంలో ఈ సంస్కరణలు బలమైన, స్థిరమైన ఫలితాలను ఇస్తాయని ఆయన అన్నారు. ఇకపై ఫస్ట్ కమ్-ఫస్ట్ సర్వ్ విధానానికి స్వస్తి పలికి, ఇసుకతో పాటు చిన్న, పెద్ద ఖనిజాల కోసం వేలం విధానాన్ని అమలు చేస్తున్నామని, దీని ద్వారా సరైన ధర నిర్ణయం, జవాబుదారీతనం మరింత మెరుగుపడుతుందని మంత్రి వివరించారు. అక్రమ గనుల తవ్వకం ఇప్పటికీ ప్రధాన సవాలుగానే ఉందని పేర్కొంటూ, దానిని అరికట్టేందుకు జీపీఎస్ ఆధారిత వాహనాల పర్యవేక్షణ, డ్రోన్ నిఘా, ఉపగ్రహ మ్యాపింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా ఖనిజ రవాణా వాహనాల్లో ఓవర్‌లోడింగ్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గనుల రంగంలో అక్రమాలను సమర్థవంతంగా నియంత్రించేందుకు, సమగ్ర సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంపై అధ్యయనం చేసి అమలు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. భవిష్యత్తులో రాష్ట్ర బడ్జెట్‌కు గనుల శాఖ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం పెరుగుతుందన్నారు. చింతన్ శివిర్‌ను నిర్వహించినందుకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి మంత్రి వివేక్ కృతజ్ఞతలు తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధిలో ఖనిజాల పాత్రపై భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమని ఆయన అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న పోటీ నేపథ్యంలో గనుల రంగాన్ని బలోపేతం చేయడం రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రయోజనకరమని పేర్కొన్న మంత్రి, ఖనిజ ఆధారిత ఆర్థిక అభివృద్ధి లో మన దేశం ముందంజలో నిలవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

Next Story