ఖేలో ఇండియా 8వ ఎడిషన్‌ను తెలంగాణకు కేటాయించాలి : మంత్రి శ్రీహరి

by Naga Rani Yarlagadda |

ఖేలో ఇండియా ఎనిమిదవ ఎడిషన్‌ను తెలంగాణకు కేటాయించాలని రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవియా అధికారిక నివాసంలో మంత్రి శ్రీహరి సమావేశమయ్యారు.

ఖేలో ఇండియా 8వ ఎడిషన్‌ను తెలంగాణకు కేటాయించాలి : మంత్రి శ్రీహరి
X
  • క్రీడల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి
  • రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

దిశ, తెలంగాణ బ్యూరో: ఖేలో ఇండియా ఎనిమిదవ ఎడిషన్‌ను తెలంగాణకు కేటాయించాలని రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవియా అధికారిక నివాసంలో మంత్రి శ్రీహరి సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీలో కేంద్ర క్రీడా శాఖ మంత్రితో సమావేశమై ఖేలో ఇండియా 8వ ఎడిషన్‌ను తెలంగాణకు కేటాయించాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఇదివరకే ఈ అంశం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయను కలిసి విజ్ఞప్తి చేశారని, తాజాగా క్రీడల శాఖ మంత్రిగా నేను కేంద్రమంత్రిని కలిసి వచ్చే సంవత్సరం నిర్వహించే ఖేలో ఇండియా క్రీడలను తెలంగాణంలో నిర్వహించేందుకు అన్ని విధాలుగా అనువైన ప్రదేశం మరోసారి వివరించానని తెలిపారు. హకీంపేట, ఆదిలాబాద్, కరీంనగర్, వనపర్తి సహా ఇలా వివిధ జిల్లాల్లో ఉన్న క్రీడా పాఠశాలల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకు అమిత ప్రాముఖ్యతను ఇస్తూ రాష్ట్ర క్రీడా పాలసీని స్వయంగా పర్యవేక్షించి తయారు చేయించారని, స్టేడియాలు నిర్మించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని రూపొందించినట్లు కేంద్ర మంత్రికి వివరించామన్నారు. మా విజ్ఞప్తులకు మన్‌సుఖ్ మాండవియా సానుకూలంగా స్పందించారని, 3 రోజుల షెడ్యూల్‌తో కేంద్ర మంత్రి తెలంగాణకు రానున్నట్లు వివరించారు.

పెండింగ్ అంశాలను కేంద్ర మంత్రితో చర్చించాం

తెలంగాణ స్పోర్ట్స్ అధారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని క్రీడా రంగానికి సంబంధించిన వివిధ పెండింగ్ పనుల (అంశాలు) గురించి కేంద్ర మంత్రితో చర్చించాం. వనపర్తిలోని హాకీ అకాడమీలో మౌలిక సదుపాయాల కల్పన, స్పోర్ట్ స్కూల్స్‌లో టర్ఫ్ ఏర్పాటు, నల్గొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్, జడ్చర్ల.. వంటి ప్రాంతాల్లోని స్పోర్ట్స్ స్కూల్స్‌లో ఎక్విప్‌మెంట్ కోసం ఫండ్స్ కావాలని కోరాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటి విషయంలో.. ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అలాగే తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. దీనికి కూడా సహకరించాలని కోరాం. మా విజ్ఞప్తుల పట్ల కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవియా సానుకూలంగా స్పందించారు' అని శివసేన రెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి,క్రీడల సలహాదారు ఏ.పీ.జితేందర్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల, ప్రాయోజిత పధకాల సమన్వయ కార్యదర్శి డా.గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.

Next Story