పెండింగ్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత క్రమంలో నిర్మించే ప్రాజెక్టులలో గౌరవెల్లి ప్రాజెక్టు సైతం ముఖ్యమైనదని.. దానిని త్వరలోనే పూర్తిచేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

పెండింగ్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత క్రమంలో నిర్మించే ప్రాజెక్టులలో గౌరవెల్లి ప్రాజెక్టు సైతం ముఖ్యమైనదని.. దానిని త్వరలోనే పూర్తిచేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పురోగతిపై సోమవారం సెక్రెటేరియట్‌లో సహచర మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. లక్షా 6 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులతోపాటు న్యాయపరమైన చిక్కులు ఏర్పడ్డాయని.. అందుకే పనులు మందగించాయని చెప్పారు. అయితే.. అవంతారాలన్నింటినీ అధిగమించి త్వరితగతిన పూర్తిచేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు.

8.23 టీఎంసీలకు సామర్థ్యం పెంపు

వరద కాలువ ద్వారా వచ్చే నీటితో సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం గౌరవెల్లి గ్రామంలో 1.41 టీఎంసీల నీటితో ఈ రిజర్వాయర్ నిర్మాణం ప్రతిపాదించగా.. అంచనాలు సవరించి 8.23 టీఎంసీల సామర్థ్యానికి పెంచి అదనపు ఆయకట్టు సేద్యంలోకి తేవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. సవరించిన ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు పెట్టామని.. భూసేకరణ విషయంలో రైతులకు అందించే చెల్లింపులు న్యాయబద్ధంగా ఉండడంతోపాటు సకాలంలో నిధుల మంజూరుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నదని ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణకు అవసరమైన నిధులను జూన్ 2 ముందే విడుదల చేస్తామని.. అందుకు సంబంధించిన ప్రక్రియను సకాలంలో పూర్తిచేయలని కరీంనగర్, జనగామ, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. న్యాయపరమైన అంశాలను ఎదుర్కొంటున్న గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన కేసు మరో రెండు రోజుల్లో విచారణకు రానున్న సందర్భంలో చిక్కులను అధిగమించేందుకు అవసరమైన వ్యూహంతో సిద్ధంగా ఉండాలని అడ్వకేట్ జనరల్‌కు సూచించారు.

భూసేకరణను పూర్తి చేయాలి

అనేక ఆవాంతరాలతో అర్ధంతరంగా నిలిచిపోయిన ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అన్నివైపులా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్య దాస్‌నాథ్‌కు సూచించారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తిచేసేందుకు నిరంతరం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నామని.. అందుకు సంబంధించిన భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి నిర్దేశించిన రీతిలో దేవాదుల, గౌరవెల్లితో సహా నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణను పూర్తి చేయాలన్నారు. పట్టణీకరణ వేగవంతంగా పెరుగుతున్న నేపథ్యంలో భూముల ధరలు పెరగడంతో రైతులు పెద్ద మొత్తంలో నష్టపరిహారం కోరుకుంటున్నారని.. అందుకు సంబంధించిన విధాన నిర్ణయాలు న్యాయపరంగా తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారుడు ఆదిత్యదాస్‌నాథ్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు, ఈఎన్సీ జనరల్ రమేశ్‌బాబు పాల్గొన్నారు.

Next Story