ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష

by Muthe.Rajitha |

హైదరాబాద్‌లోని జలసౌధలో నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కీలక సమావేశం జరిగింది.

ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని జలసౌధలో నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కీలక సమావేశం జరిగింది. రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతి, నిధుల సేకరణ, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్, ఇతర ముఖ్య అంశాలపై ఈ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, ఇంజనీర్-ఇన్-చీఫ్ జి. అనిల్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (KLIP)కు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(NDSA) కోరిన రిపోర్ట్‌పై ప్రధాన చర్చ జరిగింది.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ లోపాలు, రీడిజైన్, రిహాబిలిటేషన్ అవసరాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి NDSAతో చర్చలు జరిపిన నేపథ్యంలో.. ఈ రిపోర్ట్ తయారీని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(SLBC) సొరంగం పనుల కోసం జాతీయ స్థాయి నిపుణులతో కమిటీ ఏర్పాటు, వేగంగా పనులు పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించేలా సూచనలు జారీ చేశారు. సింగూర్, డిండి ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిపై సమీక్షిస్తూ.. సింగూర్ ప్రాజెక్టు కోసం బస్వాపూర్ నుంచి వట్టెం, ఎదుల కాల్వల నిర్మాణంపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. రూ.1,800 కోట్లతో డిండి ప్రాజెక్టు టెండర్లను ఆహ్వానించినట్లు తెలిపారు.

దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజీ-3 డిజైన్‌లను సమీక్షించి, గోదావరి నది నుంచి నీటిని సమర్థవంతంగా ఉపయోగించేందుకు కాల్వల సామర్థ్యాన్ని మెరుగుపరచాలని ఆదేశించారు. కొన్ని కాల్వల్లో పూడికతీత (డీసిల్టింగ్) పనుల పురోగతిని సమీక్షించి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు (SRSP) కింద గుండారం రిజర్వాయర్ నుంచి 24 చిన్న కాల్వలకు నీటి సరఫరా సామర్థ్యాన్ని పెంచేందుకు డీసిల్టింగ్, మరమ్మత్తు పనులను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిధుల కోసం 2025-26 బడ్జెట్‌లో రూ.11,000 కోట్ల అదనపు కేటాయింపులు కోరినట్లు ఉత్తమ్ తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులను A, B, C విభాగాలుగా విభజించి, A కేటగిరీలో 47,882 ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం కల్పించే ప్రాజెక్టులకు రూ.240.66 కోట్లు, మిగిలిన ప్రాజెక్టులకు రూ.7,500 కోట్లు కేటాయించే వ్యూహంపై చర్చ జరిగింది.

మహబూబ్‌నగర్‌లో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కొయిల్‌సాగర్, పాలమూరు-రంగారెడ్డి, నల్గొండలో SLBC, డిండి, ఉదయసముద్రం, ఖమ్మంలో సీతారామ, ఉత్తర తెలంగాణలో దేవాదుల, గౌరవెల్లి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని అన్నారు. డిసెంబర్ 2025 నాటికి 6 లక్షల ఎకరాలకు అదనపు నీటిపారుదల సౌకర్యం కల్పించే లక్ష్యంతో పనులు చేపట్టాలని ఉత్తమ్ ఆదేశించారు.

Next Story