Uttam: కృష్ణా వాటలో ద్రోహం చేసిందే కేసీఆర్.. పీపీటీలో ఉత్తమ్ ఫైర్

by Prasad Jukanti |   (  Updated:2025-07-09 12:41:12  IST  )

కృష్ణాజలాల్లో నీటి వాటాలపై ప్రభుత్వం పీపీటీ నిర్వహించింది.

Uttam: కృష్ణా వాటలో ద్రోహం చేసిందే కేసీఆర్.. పీపీటీలో ఉత్తమ్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ హయాంలోనే రాయలసీమకు కృష్ణానీటిని అక్రమంగా తరలించే ఏర్పాట్లు జరిగాయని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు కేసీఆర్ సహకరించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. బచావత్ ట్రైబ్యునల్ తర్వాత కేంద్ర జలవనరుల సంఘం ఆమోదం లేకుండా ఉమ్మడి ఏపీలో అనేక ప్రాజెక్టుల పనులు మొదలు పెట్టారు. ఎస్ఎల్ బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, డిండి, పాలమూరు రంగారెడ్డి కోయిల్ సాగర్, బీమా వంటి ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే తెలంగాణకు కృష్ణాజలాల్లో పూర్తి న్యాయం జరిగేదని చెప్పారు. కృష్ణాజలాల మళ్లింపు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇవాళ హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజా ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఆల్మట్టి ప్రాజెక్టుపై ఉమ్మడి ఏపీ హయాంలో సుప్రీంకోర్టులో కేసు వేసిందని దాంతో 1976 లో చావత్ ట్రైబ్యునల్ 2130 టీఎంసీలను మూడు రాష్ట్రాలకు కేటాయించింది. ఉమ్మడి ఏపీకి 811, కర్ణాటకకు 734, మహారాష్ట్రకు 585 టీఎంసీలు కేటాయించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. బచావత్ ట్రైబ్యునల్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏర్పాటు అయిందని ఈ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు కేసీఆర్ కృష్ణాజలాల్లో (Krishna Water) ఏపీకి 66 శాతం తెలంగాణకు 34 శాతం ఇవ్వాలని చెప్పి తెలంగాణకు తీరని ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. కృష్ణాజలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని కేసీఆర్ ఒప్పుకున్నారని ఏపీకి 512 టీఎంసీలు ఇచ్చేందుకు లిఖిత పూర్వకంగా అంగీకరించారని ఈ మేరకు కేసీఆర్, హరీశ్ సంతకాలు చేశారని అన్నారు. బీఆర్ఎస్ వాళ్లు చేసిందొకటి.. ప్రచారం చేస్తున్నది మరొకటని ప్రతి రోజూ గోబెల్స్ ని మించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా పరివాహకం తెలంగాణలోనే ఎక్కువగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కృష్ణాజలాల్లో తెలంగాణకు 71 శాతం వాటా కావాలని కోరామన్నారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారాయన్నారు. పాలమూరు-రంగారెడ్డి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను కేంద్రం ఒకేలా చూస్తోందన్నారు.

Next Story