Uttam: సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి ఎన్డీఎస్ఏ రిపోర్టునే కించపరుస్తారా? బీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్ సీరియస్

by Prasad Jukanti |   (  Updated:2025-04-29 11:49:57  IST  )

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన తుది నివేదికపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

Uttam: సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి ఎన్డీఎస్ఏ రిపోర్టునే కించపరుస్తారా? బీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్ సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో : బీఆర్ఎస్ కమీషన్ల కక్కుర్తితోనే కాళేశ్వరం కొలాప్స్ అయిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రాజెక్టు డిజైన్, నిర్మాణంలో సీరియస్ లోపాలు ఉన్నాయని, అందువల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ స్పష్టమైన రిపోర్టు ఇచ్చిందని తెలిపారు. ఇవాళ సచివాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన తుది నివేదికపై మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికైనా సిగ్గుతో తలదించుకుని క్షమాపణలు చెప్పాల్సిందిపోయి అసలు ఎన్డీఎస్ఏ రిపోర్టునే బీఆర్ఎస్ తప్పుబడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం లోపం, ఆపరేషన్ అండర్ మెయింటెనెన్స్ లోపాలతో మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందని ఎన్డీఎస్ఏ రిపోర్టు స్పష్టం చేసిందని చెప్పారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత ఘోరమైన మానవ నిర్మిత విపత్తును సృష్టించి అపఖ్యాతిని మూటగట్టుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థతను ఈ నివేదిక స్పష్టంగా వివరించిందన్నారు.

అధికారంలో ఉన్నవారి నిరంతర జోక్యం..

మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో లోపాలు ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం చేసిందని మంత్రి తెలిపారు. డీపీఆర్ తయారీకి తగిన సమయం ఇవ్వకుండా హడావుడి చేశారని, దాంతో పనితనంపై గత ప్రభుత్వం రాజీపడిందని నివేదిక స్పష్టం చేసిందన్నారు. డీపీఆర్‌లో అనుకున్న దానికి భిన్నంగా బ్యారేజీల నిర్మాణ సమయంలో అసాధారణమైన, గణనీయమైన మార్పులు జరిగాయని, నిర్మాణ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అన్నారం, సుందిళ్ల బ్యారేజీల స్థలాన్ని వరుసగా 2.2 కి.మీ. 5.4 కిలోమీటర్లు దిగువకు మార్చారని తెలిపారు. ఈ రెండు బ్యారేజీల కొత్త ప్రదేశాలు నది పరీవాహక మట్టానికి దిగువన ఉండటం చాలా అసాధారణమని, దీంతో అన్నారం బ్యారేజీకి ఎగువన భారీగా ఎసుక మేటలు వేశాయని నివేదిక పేర్కొన్నదని చెప్పారు. మూడు బ్యారేజీలలో షీట్ పైల్స్ స్థానంలో సీకెంట్ పైల్స్ వచ్చాయని సీబీఐపీ మార్గదర్శకాల ప్రకారం జియోటెక్నికల్ పరిశోధనల కోసం 85 బోర్ హోల్స్ అవసరం కాగా కేవలం 6 బోర్ హోల్స్ మాత్రమే తవ్వారన్నారు. సీడీవోపై అధికారంలో ఉన్నవాళ్లు నిరంతర జోక్యం చేసుకున్నట్లు నివేదిక స్పష్టం చేసిందన్నారు.

మేడిగడ్డ ప్రారంభానికి ముందే లోపాలు..

ఎక్కువ కమీషన్లు వస్తాయని గత ప్రభుత్వ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని మంత్రి ఆరోపించారు. అందుకే అంచనాలు భారీగా పెంచారన్నారు. రూ. 80 వేల కోట్ల అనుమతులు తీసుకుని లక్ష కోట్లు ఖర్చు చేశారన్నారు. వివిధ పేర్లతో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రుణాలు తీసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ మొదటి నివేదిక ఇచ్చిందని, ఇప్పుడు వచ్చిన తుది నివేదికలోనూ ఇదే విషయం వెల్లడించిందని ఉత్తమ్ వివరించారు. మేడిగడ్డ ప్రారంభానికి ముందే ప్రాజెక్టులో లోపాలు బయటపడ్డాయని, కానీ బీఆర్ఎస్ ఒప్పుకోలేదని, దీంతో తీవ్ర నష్టం జరిగిందన్నారు. తమ్మిడిహెట్టిని కాదని మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించడమే ప్రధాన లోపం అని ఎన్డీఎస్ఏ చెప్పిందన్నారు. మేడిగడ్డ ప్రతిపాదనను సీడబ్ల్యూసీ ప్రారంభంలోనే తోసిపుచ్చిందని ఉత్తమ్ తెలిపారు. బ్యారేజీ నిర్మాణానికి మట్టి పరీక్షలు, నాణ్యత పరీక్షలు వంటివి ఏమీ చేయలేదన్నారు. లోపాలు ఉన్నాయని ఇంజినీర్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు. తమ్మిడిహట్టి మార్పు వల్లే ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు నష్టం జరిగిందని ఉత్తమ్ పేర్కొన్నారు.

Next Story