- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బనకచర్ల టెండర్లు వెంటనే నిలిపివేయండి.. కేంద్రమంత్రికి ఉత్తమ్ లేఖ
ఏపీలో గోదావరిపై అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్లకు సంబంధించి టెండర్లను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు శనివారం లేఖ రాశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో గోదావరిపై అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్లకు సంబంధించి టెండర్లను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు శనివారం లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన ఫ్రీ-ఫీజుబిలిటి రిపోర్ట్(పీఎఫ్ఆర్)ను సైతం తక్షణమే తిరస్కరించాలని డిమాండ్ చేశారు. అందుకు సంబంధించిన డీపీఆర్‌ను అడ్డుకోవాలన్నారు. 1980లో గోదావరి జలాల ఒప్పందాన్నీ ఉల్లంఘించినట్లు అవుతుందని, గోదావరి జల వివాద ట్రిబ్యునల్‌ను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన గోదావరి నది వాటా హక్కును ప్రత్యక్షంగా ధిక్కరించడమే అవుతుందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం జూన్ 2న నిర్వహించిన సమావేశంలో ఏపీ ప్రభుత్వాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సజ్జన్ యాదవ్ చేసిన సూచన ఇందుకు అద్దం పడుతుందని తెలిపారు. అప్పటికే పీఎఫ్ఆర్ ఆమోదించినట్లు భావించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. డీపీఆర్ సమర్పించడం అంటే సీడబ్ల్యూసీ ఆమోదించినట్లే అవుతుందా అని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ కోసం కేంద్రాన్ని నిధుల కోసం ఒత్తిడి చేసిన అంశాన్ని జనవరి 22,2025న కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్‌తోపాటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసిన విషయాన్ని సైతం ప్రస్తావించారు. ఏపీ సీఎం ఈ ప్రాజెక్టు కోసం 2024, నవంబర్ 15న, డిసెంబర్ 29న కేంద్రప్రభుత్వాన్ని ఆశ్రయించారని తెలిపారు.
మొత్తం ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయం రూ.80,113 కోట్లు కాగా.. గోదావరి నుండి కృష్ణా వరకు రూ.13,511 కోట్లు అవుతుందని, కృష్ణా నుండి బొల్లపల్లి రిజర్వారాయర్‌కు రూ.28,560 కోట్లు ఖర్చు అవుతుందని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. అదేవిధంగా బొల్లపల్లి నుండి బనకచర్ల హెడ్ రెగ్యులెటరీకి రూ.38,041 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారని పేర్కొన్నారు. కేంద్ర జలవనరుల కమిషన్‌తోపాటు గోదావరి-కృష్ణా నది బోర్డులు, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండానే ఈ ప్రాజెక్టు ప్రక్రియ ముందుకు సాగుతున్నదని మండిపడ్డారు. జీడబ్ల్యూడీటీ అవార్డు ప్రకారం చూసినా 1,486 టీఎంసీలలో 968 టీఎంసీలు తెలంగాణకు కేటాయించబడ్డాయని, ఈ నీటి వాటా కేటాయింపులపై సీడబ్ల్యూసీ, జీఆర్ఎంబీ ఆమోదం కోసం వేచిచూస్తున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను ఎలా ప్రతిపాదిస్తుందని మంత్రి ఉత్తమ్ ప్రశ్నించారు. నీటి కేటాయింపులు లేకుండా ప్రాజెక్టులు నిర్మించే నైతికత ఏపీకి ఎక్కడిదని నిలదీశారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఇచ్చిన లేఖలో సైతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తిస్థాయి ప్రతిపాదనలు తమకు అందలేదని రాసిన లేఖను ఈ సందర్భంగా తెలిపారు. కేంద్ర జలవనరుల సంఘం మార్గదర్శకాలు, ట్రిబ్యునల్ నిర్ణయాలు, అంతర్ రాష్ట్ర ఒప్పందాలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.






