TG: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు అప్‌డేట్

by Gantepaka Srikanth |

30 నెలల వ్యవధిలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

TG: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు అప్‌డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: 30 నెలల వ్యవధిలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అదే విధంగా 2027 మార్చి మాసాంతానికి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసి సమృద్ధిగా సాగు నీరు, తాగు నీరు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లాతో సహా దక్షిణ తెలంగాణా ప్రాంత రైతాంగానికి సరిపడా సాగు నీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని ఆయన చెప్పారు.

ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష..

మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పురోగతిపై ఆదివారం సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో కలసి ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని, కల్వకుర్తి ప్రాజెక్టుకు 909 కోట్లు, నెట్టెంపాడుకు 252 కోట్లు, భీమా ప్రాజెక్టుకు 200 కోట్లు, కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు 185 కోట్లు కేటాయింపులు జరిగాయాయని ఆయన వివరించారు.

అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, పునరావాస పనులకు గాను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు భూసేకరణకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ, జూన్ 2 నాటికి 5000 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖా సలహాదారు ఆదిత్యాదాస్ నాథ్, ప్రధాన కార్యదర్శి ఈ. శ్రీధర్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సహాయ కార్యదర్శి కే. శ్రీనివాస్‌తో సహా నీటిపారుదలశాఖా ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Next Story