అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. యూరియాపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకున్న యూరియా సరఫరాలో జరిగిన జాప్యం, పంటకాలం సమయంలో రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ మూతపడటంతో గత ఖరీఫ్ సీజన్‌లో కొంత ఇబ్బంది ఏర్పడినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.

అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. యూరియాపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకున్న యూరియా సరఫరాలో జరిగిన జాప్యం, పంటకాలం సమయంలో రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ మూతపడటంతో గత ఖరీఫ్ సీజన్‌లో కొంత ఇబ్బంది ఏర్పడినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. అయిన కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ, అవసరమైన ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్రానికి 9.79 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయగలిగామని చెప్పారు. 2024-25 ఖరీఫ్‌తో పోల్చితే 13 వేల మెట్రిక్ టన్నులు అధికమని వెల్లడించారు. మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సమయంలో సభ్యులు మదన్ ​మోహన్ ​రావు, పాల్వాయి హరీష్ బాబు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 2018-19 నుంచి 2023-24 వరకు యూరియా అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, రబీ సీజన్‌లో ఏ సంవత్సరంలోనూ డిసెంబర్ 31 నాటికి 3 లక్షల మెట్రిక్ టన్నులకు మించి అమ్మకాలు జరగలేదని, ఈ రబీ సీజన్‌లో డిసెంబర్ 31 నాటికి 3.93 లక్షల మెట్రిక్ టన్నులు, నేటి వరకు మొత్తం 4.52 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరిగినట్లు తెలిపారు.

ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి

ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ప్రస్తుతం యూరియా 1,67,884 మెట్రిక్ టన్నులు, డీ.ఏ.పీ 51,458 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 2,67,661 మెట్రిక్ టన్నులు, ఎస్‌.ఎస్‌.పీ 22,367 మెట్రిక్ టన్నులు, ఇతర ఎరువులు30,880 మెట్రిక్ టన్నులు నిల్వల్లో ఉన్నాయన్నారు. రైతులకు అవసరమైనంత ఎరువులు ఎక్కడా కొరత లేకుండా అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఎరువుల సరఫరాలో పారదర్శకత తీసుకురావడానికి ఫెర్టిలైజర్ యాప్ ను ప్రయోగాత్మకంగా ఐదు జిల్లాల్లో అమలు చేస్తున్నామని, ఇప్పటివరకు ఈ యాప్ ద్వారా 1.59 లక్షల మంది రైతులు 4.55 లక్షల యూరియా బస్తాలు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. యాప్ అమలులో ఉన్న జిల్లాల రైతులు, డీలర్లు యాప్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

యాప్ ద్వారా రైతులకు యూరియా

యాప్ విజయవంతం కాగానే అన్ని జిల్లాలలో యాప్ అమలులోనికి తీసుకువస్తామని యాప్ ద్వారా రైతుల అవసరం మేరకు యూరియాను, వారికి సౌకర్యవంతమైన సమయంలో కొనుగోలు చేసే విధంగా చేస్తున్నామన్నారు. కొన్ని ప్రచార సాధనాలు , రాజకీయ పార్టీలు వీటి మీద కూడా అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడో రెండు, మూడు చోట్ల రైతు ఆదుర్దా పడిన సంఘటనలను చూపెట్టి, రాష్ట్రంలో యూరియా కొరత ఉందని అనడం వారి అవివేకమని పేర్కొన్నారు. డాష్ బోర్డు నిర్వహించి జిల్లాలు, మండలాలు మరియు డీలర్ల వారిగా స్టాక్ వివరాలను కలెక్టర్లకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఈ డాష్ బోర్డు సదుపాయాన్ని త్వరలోనే ఎమ్మెల్యేలకు కూడా కల్పిస్తామన్నారు. రైతులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ రాష్ట్రానికి కావాల్సినంత యూరియా కేటాయింపులు తీసుకురావడంలో ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Next Story