ప్రతీది రాజకీయమేనా?.. ప్రత్యర్థులపై మంత్రి సీతక్క ఘాటు వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

ములుగు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రతీది రాజకీయమేనా?.. ప్రత్యర్థులపై మంత్రి సీతక్క ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ములుగు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మేడారంలో జరిగిన ప్రమాద ఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సరికాదని ఆమె హితవు పలికారు. ఈ సందర్భంగా ప్రత్యర్థులకు ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మేడారం వంటి పవిత్రమైన చోట జరిగిన ప్రమాదాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవడం శోచనీయమని మంత్రి పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజల మనోభావాలను కించపరిస్తే సహించేది లేదని ఆమె స్పష్టం చేశారు. అంగన్‌వాడీలకు సెల్‌ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ బీఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. అది కేవలం తప్పుడు ప్రచారం మాత్రమేనని, అందులో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు.

మనోభావాల గౌరవం..

అసత్య ఆరోపణలతో బురదజల్లే ప్రయత్నం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే నేతలను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఆధారాలు లేకుండా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. అనంతరం జిల్లాలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను ఆమె సమీక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.

Next Story