- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Anganwadi: వారిని బ్లాక్ లిస్ట్‌లో పెడతాం.. అంగన్‌వాడీ లోపాలపై మంత్రి సీతక్క ఫైర్
మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో అమలవుతున్న పథకాల పురోగతిపై మంత్రి సీతక్క శుక్రవారం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో అమలవుతున్న పథకాల పురోగతిపై తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారులతో (DWOs) శుక్రవారం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. (Anganwadi centers) అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకుల సరఫరాలో ఎటువంటి లోపాలు ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పాలు, గుడ్లు, పప్పు, మంచి నూనె, బాలామృతం, మురుకులు, బియ్యం వంటి వస్తువుల సరఫరాపై జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించిన ఆమె, కొన్ని జిల్లాల్లో సరఫరా 50 శాతానికి కూడా చేరకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో జరిగినట్లుగా సరఫరాదారులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి సీతక్క హెచ్చరించారు. అలసత్వం ప్రదర్శిస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి బ్లాక్ లిస్టులో పెట్టాలని ఫైర్ అయ్యారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండదని ఆమె స్పష్టం చేశారు.
చిన్నారుల సంరక్షణలో అంగన్‌వాడీ సిబ్బంది పూర్తి బాధ్యత వహించాలని ఆదేశించారు. టేక్ హోమ్ రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసం ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 90 శాతం లబ్ధిదారులు FRS విధానంలో సరుకులు అందుకుంటుండగా, దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి సీతక్క వెల్లడించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుత్ కనెక్షన్, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్ల నిర్మాణ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఉదయం 9 గంటల లోపు అంగన్వాడీ కేంద్రాలు తప్పనిసరిగా ప్రారంభం కావాలని సూచించారు. కేంద్రాలు ఆలస్యంగా తెరుచుకుంటే సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో ప్రతి నెల కనీసం ఒక కొత్త చిన్నారి చేరేలా చర్యలు తీసుకోవాలని, ప్లే స్కూళ్ల స్థాయిలోనే విద్యా నాణ్యత ఉండేలా తల్లిదండ్రులకు భరోసా కల్పించాలని సూచించారు.
ఈ నెలలో ఇప్పటి వరకు గర్భిణుల హాజరు 80%, బాలింతల హాజరు 85% ఉండటం పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నారుల హాజరు ప్రస్తుతం 68% ఉండగా, దాన్ని 90%కు పెంచే లక్ష్యాన్ని నిర్దేశించారు. జిల్లా అధికారులు ప్రతి నెలా పురోగతి నివేదికలను సమర్పించాలన్నారు. బాల్యవివాహాలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలవాలని పిలుపునిచ్చారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి ఒక్క బాల్య వివాహం కూడా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే శక్తి సదనాలు, స్టే హోమ్స్, వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను అధికారులు క్రమం తప్పకుండా సందర్శించి పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమీక్షలో శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, ఇతర అధికారులు పాల్గొన్నారు.






