జువైనల్ హోం నుంచి 5 గురు బాలలు జంప్.. మంత్రి సీతక్క సీరియస్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-25 16:32:28  IST  )

సైదాబాద్‌ జువనైల్ హోమ్ నుంచి ఐదుగురు బాలలు తప్పించుకుపోయిన ఘటనపై మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు...

జువైనల్ హోం నుంచి 5 గురు బాలలు జంప్.. మంత్రి సీతక్క సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సైదాబాద్‌లోని జువనైల్ హోమ్ నుంచి మంగళవారం రాత్రి ఐదుగురు బాలలు తప్పించుకుపోయిన ఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను మంత్రి సీరియస్‌గా తీసుకున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు సూపర్‌వైజర్లపై వేటు వేసినట్లు, సూపరింటెండెంట్‌కు మెమో జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జువనైల్ హోమ్‌లో అదనపు సిబ్బందిని నియమించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో జువనైల్ వెల్ఫేర్ శాఖ అధికారులు మంత్రి సీతక్కకు ఈ ఘటనపై నివేదిక సమర్పించారు. జువనైల్ వెల్ఫేర్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ చార్వాక్, అసిస్టెంట్ చీఫ్ ప్రొబేషన్ సూపర్‌వైజర్ నవీన్ ఈ ఘటన వివరాలను మంత్రికి వివరించారు. తప్పించుకుపోయిన ఐదుగురు బాలల్లో ముగ్గురి ఆచూకీ లభించిందని అధికారులు మంత్రికి తెలిపారు. మిగిలిన ఇద్దరు బాలల ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు సహకారం తీసుకుంటున్నామని వారు వెల్లడించారు.

Next Story