లైంగిక దాడులపై మంత్రి సీతక్క ఆగ్రహం

by Muthe.Rajitha |

లైంగిక దాడి ఘటనలను ఉపేక్షించేది లేదని, నిందితులకు చట్టపరంగా కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటామని మహిళాభివ్రుద్ది, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.

లైంగిక దాడులపై మంత్రి సీతక్క ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో: లైంగిక దాడి ఘటనలను ఉపేక్షించేది లేదని, నిందితులకు చట్టపరంగా కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ పేట, హైదరాబాద్ లైంగిక దాడుల ఘటనలపై స్పందిస్తూ, లైంగిక దాడులతో సంబంధం ఉన్న నిందితులందరినీ గంటల వ్యవధిలోనే అరెస్టు చేశామని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ శిఖా గోయల్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు సివి ఆనంద్, సుధీర్ కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ లతో టెలిఫోన్లో మంత్రి ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు పురోగతి వివరాలు, బాధితుల ఆరోగ్య పరిస్థితులను అధికారులు మంత్రి సీతక్క కు వివరించారు. బాధితులకు అన్ని రకాల సహాయం చేయడంతో పాటు, నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ పేట, హైదరాబాద్ లైంగిక దాడుల నిందితుల విషయంలో ఘటన వెలుగులోకి వచ్చిన వెను వెంటనే స్పందించామన్నారు. . బాధితులకు అండగా నిలిచామని, తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సఖి సెంటర్ సంరక్షణలో బాధితులను సంరక్షిస్తున్నామని తెలిపారు. వారి బాగోగులు అన్నింటిని ప్రభుత్వమే చూసుకుంటుందన్నారు. లైంగిక దాడి ఘటనకు మత్తు పదార్థాలూ కారణమని భావిస్తున్నట్లు తెలిపారు. మత్తు పదార్థాల కట్టడికి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గస్తీ పెంచాలని పోలీస్ శాఖను కోరినట్లు తెలిపారు. పోలీస్ శాఖ సహకారంతో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Next Story