Seethakka: రాజకీయ ఒత్తిడికి తలొగ్గొద్దు.. నూతన సీడీపీవోలకు మంత్రి సీతక్క దిశానిర్దేశం

by Prasad Jukanti |

నూతన సీడీపీవోలకు మంత్రి సీతక్క నియామక పత్రాలు అందజేశారు.

Seethakka: రాజకీయ ఒత్తిడికి తలొగ్గొద్దు.. నూతన సీడీపీవోలకు మంత్రి సీతక్క దిశానిర్దేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు అంగన్ వాడీలను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి సీతక్క (Seethakka) అన్నారు. ఇందులో భాగంగా అనేక మార్పులు తీసుకువస్తున్నామని చెప్పారు. ఇటీవల టీజీపీఎస్సీ ద్వారా నూతనంగా చైల్డ్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్లుగా (NEW CDPOs) ఎంపికైన 23 మందికి ఇవాళ సచివాలయంలో మంత్రి సీతక్క నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నూతన సీడీపీవోలకు అభినందనలు తెలిపిన సీతక్క.. సీడీపీవోలు మహిళా శిశు సంక్షేమ శాఖ వెన్నెముక లాంటివారని మీరంతా ఎలాంటి రాజకీయ ఒత్తిడిలకు లొంగాల్సిన అవసరం లేదన్నారు. స్వేచ్ఛగా అంకితభావంతో విధులు నిర్వహించాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ సేవా దృక్పథంతో, మానవతతో పనిచేసే శాఖ అని అన్నారు. వేల మంది పోటీ పడితే మీ 23 మంది ఉద్యోగాలు సాధించారు. మా శాఖలో ఇది కొత్త తరం అని చెప్పారు. ఉన్నత విద్యావంతులైన మీరు మా శాఖలో చేరటం అభినందనీయం అన్నారు. చిన్నారులు, గర్భిణీలు బాలింతలకు సేవ చేసే అదృష్టం మీకు దక్కిందని.. శిశువులు మహిళల సంరక్షణతో పాటు దత్తత ప్రక్రియ, మహిళా సాధికారత వంటి అంశాలను నిర్వర్తించాల్సి ఉంటుందని సూచించారు.

అంగన్ వాడీ సేవలు పేద ప్రజలకు ఎంతో అవసరం అని లబ్ధిదారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించే బాధ్యత మీదేనన్నారు. అంగన్ వాడీలకు 57 రకాల ఆట వస్తువులు ఇచ్చామని, వారంలో రెండు రోజులు ఎగ్ బిర్యాని పెడుతున్నామని చెప్పారు. పోషకార లోపాన్ని తగ్గించేందుకు పాలు గుడ్లు క్రమం తప్పకుండా సరఫరాతో పాటు చిన్నారులకు యూనిఫామ్స్ కూడా ఇస్తున్నామన్నారు. అంగన్ వాడీలలో (Angan Wadi Centres) ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సేవలను లబ్ధిదారులకు అందజేయాల్సిన బాధ్యత మీదేనని అందువల్ల మీరు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా ఫీల్డ్ విజిట్ చేయాలని సూచించారు. అంగన్ వాడీ సేవలు మెరుగుదలకు మీరు సలహాలు సూచనలు ఇవ్వవచ్చని తెలిపారు.

Next Story