- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ponnam: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో ఆర్టీసీలో మరో జాబ్ నోటిఫికేషన్
ఆర్టీసీలో నియామకాలు వేగంగా పారదర్శకంగా జరిగేలా చూడాలని మంత్రి పొన్నం ఉన్నతాధికారులను ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ప్రభుత్వం నుండి నెల వారిగా వస్తున్న మహాలక్ష్మి (Mahalakshmi Scheme) టికెట్ ఆదాయమే కాకుండా అదనపు ఆదాయంపై దృష్టి సాధించాలని టీజీఆర్టీసీ (TGRTC) ఉన్నతాధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు. సచివాలయంలో ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఇవాళ పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్టీసీలో ఇప్పటి వరకు మహిళలాలు 237 కోట్ల జీరో టికెట్ ఉపయోగించుకున్నారని, ఇందుకు సంబంధించిన 7,980 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. టికెట్ ఆదాయంతో పాటు టికెట్ యేతర ఆదాయంపై దృష్టి సారించారని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు డిపోలు నష్టాల బారిన ఉండడానికి గల కారణాలు, స్థానిక పరిస్థితులు ఆయా డిపోలు లాభాల బాట పట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని మంత్రి ఆదేశించారు. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, పీఎం ఈ -డ్రైవ్ కింద హైదరాబాద్‍కు కేటాయించిన 2 వేల బస్సులు విడతల వారిగా రానుండడంతో అందుకు సంబంధించిన చార్జింగ్ స్టేషన్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
కొత్త కాలనీలకు బస్సులు:
నగరంలో కొత్త కాలనీలు పెరుగుతున్న నేపథ్యంలో డిమాండ్‍కు అనుగుణంగా ఆ రూట్‍లోల బస్సులను నడిపించేలా స్థానిక డీఎం ఇతర ఆర్టీసీ అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఒక నివేదికను రూపొందించి బస్సులు నడిపేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రాంతాన్ని మంత్రి ప్రస్తావించారు. ఇటువంటి ప్రాంతాల్లో ప్రయాణికుల డిమాండ్ ఉన్న నేపథ్యంలో బస్సులు నడిపించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 578 బస్సులు కొత్తగా రాష్ట్రంలో రోడ్డెక్కాయని త్వరలో మరిన్ని కొత్త బస్సులు రానుండడంతో వాటిని ప్రయాణికుల ట్రాఫిక్ ఎక్కువగా ప్రాంతాల్లో నడిపించాలని సూచించారు.
త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్:
ఇప్పటికే ఆర్టీసీలో 1000 ఆర్టీసీ డ్రైవర్లు,743 శ్రామిక్ పోస్టులకు పోలీస్ రిక్రూట్‍మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఇచ్చిన నోటిఫికేషన్ (RTC Notification) ప్రస్తుతం ఇంటర్వ్యూ దశలో ఉందని ఈ నియామకాలు వేగంగా పారదర్శకంగా జరిగేలా పూర్తి చేయాలని మంత్రి తెలిపారు. వచ్చే డిసెంబర్ చివరిలోపు 84 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, 114 సూపర్‍వైజర్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుందని ఈ నియామక ప్రక్రియ టీజీపీఎస్సీ లేదా పోలీస్ బోర్డు ద్వారా నియమించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కారుణ్య నియామకాల కింద చేరిన ఆర్టీసీ కండక్టర్లకు ఉన్న మూడు సంవత్సరాల ప్రొవిజన్ రెండు సంవత్సరాలకు తగ్గించేలా పరిశీలించాలని అధికారులకు సూచించారు. మేడారం జాతర సమీపిస్తుండటంతో ములుగు బస్ స్టేషన్ నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఫోర్త్ సిటీ లో బస్ టెర్మినల్:
సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఫోర్త్ సిటీలో బస్ టెర్మినల్ నిర్మాణం, బస్ సౌకర్యాలపై ఆర్టీసీ ఉన్నతాధికారులు అధ్యయనం చేయాలని అధికారులను పొన్నం ఆదేశించారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త డిపోలకు అవసరమైన స్థల పరిశీలన చేసి జిల్లా కలెక్టర్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని తెలిపారు. నగరంలో నలువైపుల బస్ స్టేషన్‍లు ఉండేలా జేబీఎస్ మాదిరి ఆరంఘర్‍లో అధునాతన బస్సు టెర్మినల్ నిర్మించడానికి ఆర్టీసీ, పోలీస్ శాఖకు సంబంధించిన భూ బదలాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఉప్పల్ కూడా బస్ టెర్మినల్ నిర్మించడానికి అధ్యయనం చేయాలన్నారు. రవాణా శాఖ సీజ్ చేసిన వాహనాలు బస్సు డిపోలో చాలా కాలంగా పేరుకుపోవడంతో వారికి సమయం ఇచ్చి వేలం వేయాలని సూచించారు.
డ్రైవర్ మానిటరింగ్ సిస్టం:
ఆర్టీసీలో ప్రమాదాలను తగ్గించడానికి తొలి దశలో లహరి, రాజధాని, గరుడ బస్సుల్లో అమలవుతున్న డ్రైవర్ మానిటరింగ్ సిస్టం పని తీరును ఈ సందర్భంగా మంత్రి అడిగి తెలుసుకున్నారు. దీని ద్వారా డ్రైవర్ నిద్ర ఉపక్రమించే సూచనలు కానీ, మొబైల్ వాడుతున్నప్పుడు మానిటరింగ్ చేస్తూ అప్రమత్తం చేస్తుంది. ఇక ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌లకు నిరంతరం శిక్షణ ప్రతి బస్సుకి ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరి నిర్ణయాన్ని కఠినతరం చేయాలని పేర్కొన్నారు. డ్రైవర్లకు నిరంతరం మెడికల్ టెస్ట్ నిర్వహించాలని సూచించారు. ప్రమాదాలు తగ్గించడానికి డ్రైవర్లకు నిరంతర శిక్షణ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగులతో జూమ్ సమావేశం నిర్వహిస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇది విజయవంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సుల్లో అమలు చేసేలా కార్యాచరణ తీసుకోవాలని ఆదేశించారు. తార్నాక హాస్పిటల్ లో రోగుల బంధువుల కోసం ఏర్పాటు చేస్తున్న డార్మిటరీ రూంను త్వరతిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్టీసీ ఫంక్షన్ హాల్ లు వస్తున్న ఆదాయం ఖర్చులు వివరాలపై ఆరా తీశారు. దీని ద్వారా మరింత ఆదాయం పెంచుకోవాలని సూచించారు.
మేడారంకు 3800 బస్సులు:
ఆర్టీసీ మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు అద్దె ప్రాతిపదికన నడిపించాలని సెర్ఫ్ తో ఒప్పందం చేసుకుంది. ఇప్పటివరకు 150 బస్సులు మహిళా సంఘాలు ఆర్టీసీతో సంయుక్తంగా నడుస్తున్నాయని మిగిలిన 450 బస్సులు కూడా మహిళా సంఘాల ద్వారా తీసుకోవాలని ఆదేశించారు. గత ఏడాది మేడారం జాతర కోసం 3490 బస్సులు నడపగా 16.83 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణించారు. ఈసారి జాతర కు 20 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణిస్తారని అంచనా వేస్తూ 3800 బస్సులు నడపడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఈ సమీక్షా సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఇతర ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






