కాలుష్య నివారణకు కొత్త ప్రణాళికలు : పొన్నం

by Muthe.Rajitha |   (  Updated:2025-10-22 12:20:10  IST  )

దీపావళి పండగ నేపథ్యంలో రాష్ట్ర రాజధానిలో కాలుష్యం విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే.

కాలుష్య నివారణకు కొత్త ప్రణాళికలు : పొన్నం
X

దిశ, వెబ్ డెస్క్ : దీపావళి పండగ నేపథ్యంలో రాష్ట్ర రాజధానిలో కాలుష్యం విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. రెండురోజులపాటు బాణాసంచా కాల్చడంతో AQI ఏకంగా 400 దాటింది. అయితే రానున్న రోజుల్లో వాతావరణ కాలుష్యం భారీగా తగ్గించేందుకు కొత్త ప్రణాళికలు తీసుకు వస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పేర్కొన్నారు. నేడు మంత్రి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో అత్యధిక కాలుష్యం ఉన్న ఢిల్లీ సంగతి అందరికీ తెలిసిందేనని అన్నారు.

ఢిల్లీ లాంటి పరిస్థితి హైదరాబాద్ నగరానికి రాకుండా మరిన్ని కొత్త ప్రణాళికలు చేపడుతున్నట్టు తెలిపారు. అలాగే వాహనాల స్క్రాపింగ్ విషయంలోనూ కొత్త పాలసీలు తీసుకువస్తామన్నారు. ఇక హైదరాబాద్ ప్రజారవాణాలో పూర్తిగా ఎలక్ట్రికల్ వాహనాలకే ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. ఎలక్ట్రికల్ వాహనాలు కొనుగోలు చేసేవారికి ఇప్పటికే వాహన రిజిస్ట్రేషన్ ఫీజు రద్దు చేశామని పేర్కొన్న పొన్నం.. నగర ప్రజలు కూడా వాతావరణ కాలుష్యంను దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపాలని సూచించారు.

ఎలక్ట్రిక్‌ వాహనాలపై రూ.577 కోట్ల పన్ను మినహాయింపు ఇవ్వడంతో EV వాహనాలు కొనుగోళ్లు భారీగా పెరిగాయన్నారు. వాహన సారథి పోర్టల్‌ను పూర్తిగా అందుబాటులోకి తెచ్చామని, ఇకపై షోరూమ్‌లోనే వాహనాల రిజిస్ట్రేషన్‌ చేసే అంశంపై పరిశీలనలో ఉందన్నారు. వాహన రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో దళారులు లేకుండా చేసేందుకు ఏఐ వినియోగాన్ని మరింత పెంచుతామన్నారు.

Next Story