వాళ్లు ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ : మంత్రి పొన్నం ప్రభాకర్ హాట్ కామెంట్స్

by Ramesh Naini |

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష బాధ్యతలు వదిలి.. శత్రుదేశంగా సొంత రాష్ట్రానికి నష్టం కలిగేలా చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.

వాళ్లు ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ : మంత్రి పొన్నం ప్రభాకర్ హాట్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష బాధ్యతలు వదిలి.. శత్రుదేశంగా సొంత రాష్ట్రానికి నష్టం కలిగేలా చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) మండిపడ్డారు. పక్క రాష్ట్రంలో రాష్ట్రానికి ఏమైనా సమస్య వస్తే అన్నీ పార్టీలు కలిసి వస్తాయన్నారు. తెలంగాణలో కూడా ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇవాళ గాంధీభవన్‌లో మంత్రి పొన్నం అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. అంతకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. (BRS BJP) బీజేపీ, బీఆర్ఎస్‌ పార్టీలు ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీలాగా వ్యవహరిస్తున్నాయని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం మీరు ఏం చేశారని, బాధ్యతారహితంగా వ్యహరించినందుకు మీకు ప్రజలు సున్నా సీట్లు ఇచ్చారని విమర్శించారు. రాబోయే కాలంలో మిమ్మల్ని ప్రజలు కనుమరుగు చేస్తారని విమర్శలు గుప్పించారు.

ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం..

తెలంగాణలో ప్రజా పాలన ప్రభుత్వం నెల రోజుల్లోపు పడిపోతుందని పిల్లి శాపనార్ధాలు పెడుతున్నారని, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తూ ప్రభుత్వం నిలవదని శాపనార్థాలు పెట్టారని మంత్రి పొన్నం ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ ప్రజల సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతుంటే.. ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, ఆర్థిక సంక్షోభం ఉన్న తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆచరణలో చూపెడుతుందన్నారు.

త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ

జులై 4వ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభను సక్సెస్ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి జన సమీకరణ చేయాలన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. దేవాలయ కమిటీలు, మార్కెట్ కమిటీలు ఖాళీగా ఉన్న ఇతర ఏ నామినేటెడ్ పదవులు త్వరలోనే భర్తీ పూర్తవుతుందన్నారు. ప్రభుత్వం, పార్టీ సమన్వయం చేసుకోవాలని, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. కాగా, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ప్రథమ వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్‌లో ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తదితర నేతలు నివాళులర్పించారు.

Next Story