- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Govt: చెంచులకు ఒకే దశలో 9 వేల ఇందిరమ్మ ఇళ్లు
ప్రతిపక్ష ఎమ్మెల్యేలకూ ఇందిరమ్మ ఇళ్ల కోటా కేటాయిస్తామని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలా తాము చేయబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతిపక్ష ఎమ్మెల్యేలకూ ఇందిరమ్మ ఇళ్ల కోటా కేటాయిస్తామని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలా తాము చేయబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మంత్రి పొంగులేటి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెంచులకు ఒకే దశలో 9 వేల ఇందిరమ్మ ఇళ్లు త్వరలో ఇస్తామని చెప్పారు. పొలిటికల్‌గా తమకు నష్టం జరిగినా అత్యంత పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 600 చదరపు అడుగుల నిబంధన అనేది పేదవారికి లబ్ధి జరగాలనే పెట్టామని చెప్పారు. తెలంగాణ నుంచి ఏపీలో కలిసిన 7 మండలాల ప్రజల స్థానికతపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
మురికివాడల్లోనే జీ ప్లస్ త్రీ అపార్ట్‌మెంట్లు
తరతరాలుగా సొంత ఇళ్లకు నోచుకోని చెంచుల సొంతింటి కలను సీఎం రేవంత్ నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం సాకారం చేయబోతున్నదని మంత్రి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని ఉట్నూరు, భద్రాచలం, మున్ననూర్, ఏటూరు నాగారం ఐటీడీఏల పరిధిలో సచ్యురేషన్ పద్ధతిలో దాదాపు 9వేలరే పైగా చెంచు కుటుంబాలను గుర్తించడం జరిగిందని, వీరందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లపై మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో శాశ్వత గృహాలను నిర్మించాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పలు సందర్భాలలో సూచించారని, అలాగే సీఎం కూడా అనేక సందర్భాలలో గిరిజన ప్రాంతాలలో అభివృద్ధి, ముఖ్యంగా వారి నివాస గృహాల నిర్మాణంపై అనేక సూచనలు చేశారని చెప్పారు. అడవులను నమ్ముకొని జీవించే గిరిజనులలో చెంచులు ఒక జాతి అని, చిన్నచిన్న గుడిసెలు తప్ప వీరికి పక్కా ఇల్లు ఎలా ఉంటుందో ఊహకు అందని విషయమని చెప్పారు. అందుకే వీరు జీవించే ప్రదేశంలోనే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన కూడా చేయలేదన్నారు.
ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో ఆసిఫాబాద్ 3,551, బోథ్ 695, ఖానాపూర్ 1,802, సిర్పూర్ 311, ఆదిలాబాద్ 1,430, బెల్లంపల్లి 326, భద్రాచలం పరిధిలో అశ్వరావుపేట 105, మున్ననూర్ చెంచు స్పెషల్ ప్రాజెక్ట్‌లో అచ్చంపేట్ 518, మహబూబ్‌నగర్ 153, పరిగి 138, తాండూర్ 184 ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని, అయితే ఐటీడీఏ పరిధిలోని గిరిజన నియోజకవర్గాలకు అదనంగా 500 నుంచి 700 ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చిందని, ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లకు గాను 20 శాతం ఇళ్లను బఫర్ కింద పెట్టుకోవడం జరుగుతుందన్నారు. పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. మురికి వాడల్లో జీవనం కొనసాగిస్తున్న పేదలు అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారని, హైదరాబాద్‌కు దూరంగా ఇళ్లు నిర్మించి ఇస్తే తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. గత ప్రభుత్వం కొల్లూరులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తే వాటిని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్న ప్రాంతంలోనే జీ ప్లస్ త్రీ పద్ధతిలో అపార్ట్‌మెంట్లు నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు.






