- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: పేదరికమే అర్హత.. కలెక్టర్లదే బాధ్యత
రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నా ఈ నెల చివరి నాటికి లబ్ధిదారులను గుర్తించి కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నా ఈ నెల చివరి నాటికి లబ్ధిదారులను గుర్తించి కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఇన్‌చార్జి మంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, హౌసింగ్, రెవెన్యూ, ఫారెస్టు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చివరి దశలో ఉన్న ఇండ్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. అంసపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తి చేయడానికి ఇంతవరకు ఖర్చు చేసిన మొత్తాన్ని మినహాయించి, తదుపరి అవసరమైన వ్యయాన్ని ఐదు లక్షలలోపు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అందజేస్తామని వెల్లడించారు. వాటిని పూర్తిచేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాని పక్షంలో లబ్ధిదారులే నిర్మించుకునేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ ఇండ్ల నిర్మాణాలకు గ్రీన్ చానల్‌లో నిధులు విడుదల చేస్తామన్నారు. చాలా ఇండ్లలో అనర్హులు ఉన్నారని, వారిని తొలగించి అర్హులకు ఇవ్వాలని సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ తక్షణమే అనర్హులను తొలగించే చర్యలు చేపట్టాలని, అర్హులకు కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందులో ఎమ్మెల్యేలను భాగస్వామ్యులను చేయాలని సూచించారు. 2 బీహెచ్‌కే బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడితే సర్వీసు నుంచి తొలగించడానికి సైతం వెనకాడబోమని హెచ్చరించారు. పేదరికమే అర్హత అని, అర్హులైన వారికి ఇండ్లను ఇవ్వడమే కలెక్టర్ల బాధ్యత అని సూచించారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన 40 టన్నుల ఇసుకను ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. నగరానికి దూరంగా 2 బీహెచ్‌కే కాలనీలను నిర్మించడం వల్ల లబ్ధిదారులు అక్కడ నివసించడానికి ఇష్టపడటం లేదన్నారు. ఆయా కాలనీలకు సమీపంలో నివసించే వారికి కేటాయించలన్న ఆలోచన చేస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ లేదు..
ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎలాంటి రాజీ లేదని మంత్రి స్పష్టం చేశారు. భూముల ఆక్రమణలను కట్టడి చేయడానికి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. రెవెన్యూ, ఫారెస్టు భూముల సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఇందుకోసం రెవెన్యూ, ఫారెస్టు విభాగాలు జాయింట్ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. దీనిద్వారా భవిష్యత్తుల్లో వివాదాలకు తెరపడుతుందన్నారు. రాష్ట్రంలో భూ పరిపాలనను బలోపేతం చేయడంలో భాగంగా సర్వే, సెటిల్‌మెంట్, భూ రికార్డుల శాఖ ద్వారా సమగ్ర సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. భూ రికార్డుల్లో పాదర్శకత, ఖచ్చితత్వం తీసుకు రావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కొత్తగా రెవెన్యూ డివిజన్లను మండలాలను ఏర్పాటు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇండ్ల పథకం చాలా ప్రతిష్టాత్మకమైనదని.. ఈ పథకం చాలా అద్భుతంగా అమలవుతున్నదని చెప్పారు. దీనిపై కలెక్టర్లు మరింత ఫోకస్ పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు దామోదర్ రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావు, డి.శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్, రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్‌కుమార్, హౌసింగ్ కార్యదర్శి వీపీ గౌతం తదితరులు పాల్గొన్నారు. అనంతరం హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో 30 కేవీ ఉత్పాదన సామర్థ్యంతో నెలకొల్పిన సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ప్లాంట్‌ను మంత్రి ప్రారంభించారు.






