HYD: డ‌బుల్ బెడ్ రూమ్ ల‌బ్ధిదారుల‌కు బిగ్ అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

by Gantepaka Srikanth |

హైద‌రాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మ‌ల్కాజిగిరి జిల్లాల క్యూర్ ప‌రిధిలో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణానికి అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేయాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.

HYD: డ‌బుల్ బెడ్ రూమ్ ల‌బ్ధిదారుల‌కు బిగ్ అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైద‌రాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మ‌ల్కాజిగిరి జిల్లాల క్యూర్ ప‌రిధిలో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణానికి అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేయాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో నివ‌సించే పేద ప్రజ‌ల జీవ‌నోపాధికి ఇబ్బంది లేకుండా స్థలాల‌ను గుర్తించాల‌ని సూచించారు. సోమ‌వారం స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో స‌హ‌చ‌ర మంత్రులు శ్రీ‌ధ‌ర్‌బాబు, అజారుద్దీన్‌, పొన్నం ప్రభాక‌ర్‌తో క‌లిసి క్యూర్‌ ఏరియాలో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం, డ‌బుల్ బెడ్ రూం ఇళ్లపై స‌మీక్ష స‌మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ప‌ట్టణ ప్రాంతాల్లో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామ‌ని చెప్పారు. క్యూర్ ప‌రిధిలో ఇందిర‌మ్మ ఇళ్లకు, డ‌బుల్ బెడ్ రూం ఇళ్లకు పార‌ద‌ర్శకంగా ల‌బ్ధిదారుల ఎంపిక ఉండాల‌ని.. ఎలాంటి రాజ‌కీయ ఒత్తిళ్లకు త‌లొగ్గవ‌ద్దని ఆదేశాలు జారీ చేశారు.

డబుల్ బెడ్ రూం ఇళ్లు పొంది వాటిలో నివ‌సించ‌కుండా అద్దెకు ఇస్తున్న వారికి, ఏళ్ల త‌రబ‌డి తాళాలు వేసి ఖాళీగా ఉంచుతున్న వారికి నోటీసులు జారీ చేయాల‌ని సూచించారు. నోటీసుల‌కు స్పందించ‌ని వారి ఇళ్లను ర‌ద్దు చేసి అర్హులైన పేద‌ల‌కు కేటాయించాల‌న్నారు. ఇప్పటి వ‌ర‌కు ఎంత‌మందికి నోటీసులు ఇచ్చారు? ఎంత‌మంది స్పందించారు? అక్కడ నివాసం ఉండ‌క‌పోవ‌డానికి వారు చెప్పిన కార‌ణాలపై ఆరా తీశారు. 2 బీహెచ్‌కే, జెఎన్ఆర్ఎమ్ త‌దిత‌ర ప‌థకాల్లో ఇళ్లు పొంది నివాసం ఉండని ఇళ్లను మే 1వ తేదీ నుంచి ప‌రిశీలించాల‌ని, అటువంటి వారికి నోటీసులు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ నిబంధ‌న‌ల‌కు ఆమోదం తెలిపేలా వారి నుంచి అండ‌ర్ టేకింగ్ తీసుకోవాల‌ని సూచించారు. వివిధ కాల‌నీల్లో ఉన్న వాణిజ్య స‌ముదాయాల‌ను అద్దె ప్రాతిప‌ద‌క‌న కాకుండా వేలం ప‌ద్ధతిలో విక్రయించాల‌ని.. ఆ డ‌బ్బును అక్కడి సొసైటీ, ప్రభుత్వం పేరిట జాయింట్ అకౌంట్ పేరిట వేయాల‌న్నారు. ఈ స‌మావేశంలో గృహ నిర్మాణ శాఖ కార్యద‌ర్శి, ఎండీ వీపీ గౌత‌ం, హైద‌రాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మ‌ల్కాజ్‌గిరి జిల్లాల క‌లెక్టర్లు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Next Story