Ponguleti: సంక్షోభంలో రాష్ట్రాన్ని అప్ప‌గిస్తే సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దాం: పొంగులేటి

by Prasad Jukanti |

ఆర్ధిక ఇబ్బందుల కార‌ణంగానే ఈ రెండు గ్యారంటీల‌ను పూర్తిగా అమ‌లు చేయ‌లేదని మంత్రి పొంగులేటి చెప్పారు.

Ponguleti: సంక్షోభంలో రాష్ట్రాన్ని అప్ప‌గిస్తే  సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దాం: పొంగులేటి
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏ వర్గాన్ని విస్మరించకుండా అభివృద్ది, సంక్షేమానికి స‌మ ప్రాధాన్యత ఇస్తూ ఎన్నిక‌ల్లో ఇచ్చిన ప్రతి హామీని నిల‌బెట్టుకున్నామ‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Ponguleti Srinivasa Reddy) అన్నారు. అభివృద్ది సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచింద‌న్నారు. రెండేళ్ల పాల‌న‌కు ప్రజామోదం సంపూర్ణంగా ఉంద‌ని కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఫ‌లితాలే ఇందుకు నిదర్శనం అన్నారు. ఆదివారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన పొంగులేటి రెండేళ్ల పాలనపై స్పందించారు. ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో వసంతంలోకి అడుగుపెడుతోందని రెండేళ్ల కాలం తక్కువే కానీ ప్రభుత్వం సాధించిన విజయాలు మాత్రం అత్యద్భుతం అన్నారు. ధ‌నిక రాష్ట్రాన్ని త‌మ స్వార్ధపూరిత నిర్ణయాలతో పదేళ్లలో దివాలా తీయించి ఆర్ధిక సంక్షోభంలో రాష్ట్రాన్ని అప్పగిస్తే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రెండేళ్లలో సంక్షేమ రాష్ట్రంగా అభివృద్ది దిశ‌లో ప‌రుగులు పెట్టిస్తున్నామ‌న్నారు.

రెండేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడిన నాడు ఉన్న అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్ది దేశానికే ఆదర్శంగా ప్రజారంజక పాలన సాగిస్తున్నాం. ఎక్కడలేని ఎవరూ ఊహించని అభివృద్ధి సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి వాటిని దిగ్విజయంగా అమలు చేస్తున్నామన్నారు. సన్నబియ్యం ఇందిర ఇండ్లు దేశానికి దిక్సూచిగా నిలిచాయి. ఏ రంగాన్ని విస్మరించకుండా ఏ ఒక్క వర్గం నిరాధారణకు గురికాకుండా అభివృద్ధి సంక్షేమం అనే రెండు చక్రాలపై ప్రగతి ర‌థం పరుగులు తీస్తోందన్నారు. రాష్ట్రంలో ఇందిర‌మ్మ ప్రభుత్వం ఏర్పడిన వెంట‌నే ఆరు గ్యారంటీల అమ‌లుకు శ్రీ‌కారం చుట్టామని వీటిలో నాలుగు గ్యారంటీల‌ను అమ‌లు చేశామన్నారు. మిగిలిన రెండు గ్యారంటీల‌లో కొన్నింటిని పాక్షికంగా అమ‌లు చేశామని ఆర్ధిక ఇబ్బందుల కార‌ణంగానే ఈ రెండు గ్యారంటీల‌ను పూర్తిగా అమ‌లు చేయ‌లేదని చెప్పారు. అయినా వాటిని ప్రజలకు అందించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఎన్నిక‌ల్లో హామీలు ఇవ్వకపోయినా ప్రజల సంక్షేమం కోసం ప‌లు ప‌థకాల‌ను అమ‌లు చేశామని వ్యవ‌సాయ‌, పారిశ్రామిక రంగాల‌లో గ‌ణ‌నీయ‌మైన ప్రగ‌తిని సాధిస్తున్నామని చెప్పారు. ఆర్ధికవృద్దిలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్ధానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ - 2047 విజన్‍తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 2035 నాటికి తెలంగాణ ఆర్ధిక వ్యవ‌స్ధను ఒక ట్రిలియ‌న్ డాల‌ర్ ఎకాన‌మీగా వృద్ది సాధించాల‌నే లక్ష్యంతో ప‌నిచేస్తున్నట్టు చెప్పారు. 2047 నాటికి మూడు ట్రిలియ‌న్ డాల‌ర్ల ల‌క్ష్యం సాధించాల‌ని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు.

ఒక‌వైపు ప్రపంచ న‌గ‌రాల‌తో పోటీ ప‌డే ల‌క్ష్యాల‌ను నిర్ధేశించుకొని మ‌రోవైపు పేద‌ల ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫ‌లాలు అందిస్తూ, ద్విముఖ వ్యూహంతో మా ప్రభుత్వం పాల‌న సాగిస్తోందని పొంగులేటి చెప్పారు. పాల‌న‌లో పార‌ద‌ర్శక‌త‌, అభివృద్దిలో ఆధునిక‌త‌, సంక్షేమంలో స‌రికొత్త చ‌రిత్రను రాస్తూ తెలంగాణ‌ను రెండేళ్లలో దేశానికి రోల్‌మోడ‌ల్‌గా నిల‌బెట్టాంమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాల‌న‌పై ప్రజలు పూర్తి సంతృప్తి ఉందన్న విష‌యం ఇప్పటి జ‌రిగిన ఉప ఎన్నిక‌లే రుజువు చేస్తున్నాయని. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల‌ను (Jubilee Hills By-election) రిఫ‌రెండ‌మ్ అని బీఆర్ఎస్ ప్రకటించిన విష‌యాన్ని గుర్తుచేసుకుంటే మా ప్రభుత్వానికి, సిఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పాల‌న‌కు ఎన్ని మార్కులు ఇవ్వవచ్చో అంద‌రికీ అర్థం అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఈ రెండేళ్లలో రెవెన్యూ, హౌసింగ్, స‌ర్వే త‌దిత‌ర విభాగాల‌లో విప్లవాత్మక మార్పుల తీసుకువ‌చ్చామని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భూ సమస్యలను వీలైనంతవ‌ర‌కు త‌గ్గించ‌డం, అర్హులంద‌రికీ ఇందిర‌మ్మ ఇండ్లు ఇవ్వడం త‌మ ప్రభుత్వం ముందున్న ప్రథమ లక్ష్యం అన్నారు. ఇప్పటికే ఈ లక్ష్యం దిశ‌గా తాము చేప‌ట్టిన చర్యలు విజ‌య‌వంతంగా అమ‌లు అవుతున్నాయ‌ని చెప్పారు.

Next Story