కేరళ CM విజయన్‌కు మంత్రి పొంగులేటి కౌంటర్

by Gantepaka Srikanth |

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన విమర్శలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.

కేరళ CM విజయన్‌కు మంత్రి పొంగులేటి కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్(CM Pinarayi Vijayan) చేసిన విమర్శలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా విజయన్‌కు కౌంటర్ ట్వీట్ పెట్టారు. తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా యంత్రాంగం పనిచేస్తోందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో చోటుచేసుకున్న పరిణామాలపై స్పందిస్తూ, ఈ వ్యవహారంలో రాజకీయ లబ్ధి కోసం కేరళ కాంగ్రెస్‌ను లాగడం సరికాదని పేర్కొన్నారు.

నిబంధనల ప్రకారమే చర్యలు..

రాష్ట్రంలో పాలన పూర్తిగా స్థానిక పరిస్థితులు మరియు చట్టపరమైన నిబంధనల ప్రకారమే సాగుతోంది. భవిష్యత్ తరాల ఆస్తులైన ప్రభుత్వ భూములను కాపాడటం ప్రభుత్వ బాధ్యత. చట్టబద్ధంగా జరుగుతున్న ఈ చర్యలను 'బుల్డోజర్ రాజ్' అని అభివర్ణించడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదల పక్షాన ఉంటుందని, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని వెల్లడించారు.

ల్యాండ్ మాఫియాపై ఉక్కుపాదం..

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలోని భూదాన్ భూములను ల్యాండ్ మాఫియా నకిలీ పత్రాలతో అమాయక ప్రజలకు విక్రయించినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ మోసానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితుల నుండి వసూలు చేసిన సొమ్మును తిరిగి ఇప్పించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

బాధితులకు 'ఇందిరమ్మ ఇండ్లు'..

ఇళ్లు కూల్చివేతకు గురైన అర్హులైన పేదలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి భరోసా ఇచ్చారు. బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా ప్రభుత్వం తరపున పక్కా గృహాలను నిర్మించి ఇస్తామని, ప్రతి అర్హ పేదవాడికి న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.

Next Story