మంత్రి కొండా సురేఖకు స్వల్ప అస్వస్థత

by Muthe.Rajitha |

విరామం లేకుండా విస్తృతంగా కార్యక్రమాల్లో పాల్గోనడంతోనే మంత్రి కొండా సురేఖ స్వల్ప అస్వస్థతకు గురి అయ్యారని వైద్యులు స్పష్టం చేశారు.

మంత్రి కొండా సురేఖకు స్వల్ప అస్వస్థత
X

దిశ, తెలంగాణ బ్యూరో: విరామం లేకుండా విస్తృతంగా కార్యక్రమాల్లో పాల్గోనడంతోనే మంత్రి కొండా సురేఖ స్వల్ప అస్వస్థతకు గురి అయ్యారని వైద్యులు స్పష్టం చేశారు. గురువారం మంత్రి కొండా సురేఖ సచివాలయంలో అస్వస్థతకు గురి అయ్యారు. విషయం తెలుసుకున్న వైద్యులు మంత్రికి అక్కడే ప్రథమ చికిత్స నిర్వహించారు. గ‌త కొద్ది రోజులుగా వ‌రంగ‌ల్ ఈస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో విరామం లేకుండా వివిధ కార్యక్రమాలకు హాజరుకావడం, ప్రపంచ పర్యావ‌ర‌ణ దినోత్సవం సంద‌ర్భంగా హైద‌రాబాదు పీసీబీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన ప్రొగ్రాంలో పాల్గొన‌డం, అటు త‌ర్వాత స‌చివాల‌యంలో జరిగే క్యాబినెట్ స‌మావేశానికి హాజ‌రు అయ్యేందుకు అవసరమైన డేటాను అధికారుల నుంచి సేకరిస్తున్న నేపథ్యంలో సకాలంలో ఆహారం తీసుకోలేక పోవడంతో మంత్రి అస్వస్థతకు గురి అయ్యారని వైద్యులు పేర్కొన్నారు.

అయితే, ఈ సంఘటన పై ఎటువంటి ఆందోళ‌న అక్కర్లేదని, విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని అన్నారు. అస్వస్థతకు గురైన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకొని మంత్రి కొండా సురేఖను ప‌రామ‌ర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై సీఎం వైద్యులను ఆరా తీశారు. ఒక‌టి, రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే స‌రిపోతుంద‌ని వైద్యులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆరోగ్యం ప‌ట్ల జాగ్రత్తలు తీసుకోవాల‌ని, ఇంటికి వెళ్ళి రెస్టు తీసుకోవాల‌ని మంత్రి సురేఖకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తన ఆరోగ్యం పట్లా వ‌రంగ‌ల్ ఈస్ట్ నియోజ‌క‌వ‌ర్గవాసులు, జిల్లాకు చెందిన వారు ఎటువంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని మంత్రి సురేఖ ఉద్ఘాటించారు. గ‌త కొన్ని రోజులు బిజిబిజి షెడ్యూల్ నేప‌థ్యంలో ఆహారం సకాలంలో తీసుకోక‌పోవ‌డంతోనే ఇబ్బంది త‌లెత్తింద‌ని సురేఖ చెప్పుకొచ్చారు.

Next Story