- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారికి త్వరలో టెండర్లు
అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారికి త్వరలోనే టెండర్లు పిలువనున్నట్లు రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారికి త్వరలోనే టెండర్లు పిలువనున్నట్లు రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారుల మంజూరీపై సుదీర్ఘంగా చర్చించారు. మల్కాపూర్ నుంచి విజయవాడ (అమరావతి) వరకు 4 వరుసల రహదారిని నిర్మించేందుకు జీఎంఆర్ తో చేసిన ఒప్పందాన్ని రద్దు చేశారని మంత్రి తెలిపారు. తాజాగా నాలుగు వరుసల రహదారిని 6 వరుసలుగా నిర్మించాలని, అదనంగా సర్వీస్ రోడ్డును రెండు వరుసలకు పెంచాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు. డెత్ రోడ్డుగా పిలిచే హైదరాబాద్-విజయవాడ రహదారిపై (NH-65) జూలై 27 న జరిగిన ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీల మృతి చెందిన విషయాన్ని గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ప్రతి రోజు ప్రమాదాల వార్తలను వినడం, కొన్నిసార్లు ప్రత్యక్షంగా చూడటం బాధ కలిగిస్తుందని తన ఆవేదనను గడ్కరీకి తెలియజేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తిపై గడ్కరీ సానుకూలంగా స్పందించారు. ఆగష్టు 15న కేంద్రం నిర్వహించే ఫైనాన్స్ మీటింగ్ లో ఎన్.హెచ్-65 విస్తరణను ఆమోదిస్తామని.. త్వరితగతిన అంచనాలు రూపొందించి పంపాలని కేంద్ర మంత్రి సూచించారు. వెంటనే టెండర్లు పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డికి హామీ ఇచ్చారు.
* ఆర్ఆర్ఆర్: సంగారెడ్డి టూ చౌటుప్పల్ వరకు రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ పూర్తి చేసిన విషయాన్ని గడ్కరీ దృష్టికి తెచ్చారు. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని కోరారు. 4 వరుసలుగా నిర్మించాలనుకున్న రీజినల్ రింగ్ రోడ్డు ను భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 6 వరుసలుగా నిర్మించేందుకు ఎస్టిమేషన్లు మాడిఫై చేస్తున్నామని, టెండర్లను సైతం అందుకు అనుగుణంగా ఫైనలైజ్ చేస్తమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు. రీవైజ్
ఎష్టిమేషన్ తో 3 నెలల్లో ఉత్తర భాగం పనులు మొదలు పెట్టాలని, అంతేకాకుండా ఉత్తర భాగంతో పాటే దక్షిణ భాగం కూడా యుద్ధప్రతిపాదికన ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం ఇండస్ట్రీయల్ కారిడార్ గా రూపుదిద్దుకొనున్న నేపథ్యంలో వేగంగా పనులు చేపడితే అనుకున్న వ్యయంలోనే భూసేకరణ పూర్తవుతుందని, ఆలస్యం జరిగితే భూసేకరణకు ధరలు పెరిగి ప్రాజెక్టుకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని సమగ్రంగా వివరించారు. మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తిపై పాజిటివ్ గా స్పందించిన గడ్కరీ.. అలైన్ మెంట్ ప్రపోజల్స్ పంపితే, అనుకున్నదానికన్న ముందే పనులు ప్రారంభించేలా చర్యలు చేపడతామని గడ్కరీ హామీఇచ్చారు.
* ఎల్ బీ నగర్ - మల్కాపూర్: చింతల్ కుంట చెక్ పోస్ట్ నుంచి హయత్ నగర్, ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వరకు దాదాపు 5.5 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎలివేటెడ్ కారిడార్ గా నిర్మించడంతో పాటు నాగ్ పూర్ లో మాదిరిగా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ గా నిర్మాణం చేపట్టాలని కోరారు. అందుకు సంబంధించిన ప్రపోజల్స్ పంపిస్తే వెంటనే మంజూరీలు ఇస్తానని గడ్కరీ హామీ ఇచ్చారు. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం వియూపీలు నిర్మించడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతామని, దాన్ని ఎలివేటెడ్ గా మంజూరీ చేయాలని కోరారు.
* హైదరాబాద్–శ్రీశైలం రోడ్డ్ జాతీయ రహదారి(ఎన్ హెచ్ -765): హైదరాబాద్ - శ్రీశైలం రహదారి లో టైగర్ రిజర్వ్ నుంచి వెళ్తున్న ప్రాంతాన్ని ఎలివేటెడ్ కారిడార్ గా గుర్తించాలని కోరారు. ఈ రహదారి ప్రాంతం ప్రస్తుతం 62 కిలోమీటర్లు ఉందని, ఎలివేటెడ్ కారిడార్ గా మార్చితే నాలుగు కిలోమీటర్లు తగ్గి 58 కిలోమీటర్ల అవుతుందని అన్నారు.
* హైదరాబాద్ – మన్నెగూడ : ఈ రహదారికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఉన్న అంశాన్ని త్వరగా పూర్తి చేసి కాంట్రాక్టర్ ను ఒప్పించి త్వరితగతిన పనులు పూర్తిచేయడానికి సహకరించాలని అన్నారు. ఇవే కాకుండా, సేతు బంధన్ మరియు సీఆర్ఐఎఫ్ (సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) నుంచి ప్రపోజల్స్ ఫర్ శాంక్షన్ కు విజ్ఞప్తి చేశారు. ఉప్పల్ ఫ్లైఓర్ పనులపై నిరంతరం పర్యవేక్షిస్తున్నానని, వీటితో రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన రహదారుల అందించేందుకు హ్యామ్ విధానంలో ఇప్పటికే రోడ్లను ఎంపిక చేశామని తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నాని, అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో పనులు ముందుకు సాగుతున్నాయని వివరించారు. అన్ని అంశాలను త్వరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారు. అడిగిన ప్రతి రహదారి విజ్ఞప్తిని ఎంతో సహృదయంగా స్వీకరించి అన్ని రోడ్లకు మంజూరీలు ఇస్తానని తెలిపిన కేంద్ర మంత్రి గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో తెలంగాణ ఎంపీలు, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






