BRS అధికారంలో ఉన్నన్ని రోజులు తెలంగాణకు నష్టమే: మంత్రి కిషన్ రెడ్డి

by Disha Web Desk 19 |
BRS అధికారంలో ఉన్నన్ని రోజులు తెలంగాణకు నష్టమే: మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ నీతి అయోగ్ సమావేశానికి వెళ్లరని సమాచారం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ది బాధ్యతరాహిత్యమైన చర్యగా ఆయన విమర్శలు చేశారు. భారత ప్రభుత్వం చేపట్టే అనేక కార్యక్రమాలకు ఆయన హాజరవ్వడంలేదన్నారు. రాష్ట్రంలో వరి ధాన్యం కొనేందుకు యాక్షన్​ప్లాన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీటింగ్ పెట్టినా వెళ్లలేదని ఆయన ఫైరయ్యారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఓపెనింగ్‌కు, వందే భారత్, సికింద్రాబాద్ స్టేషన్ ఫౌండేషన్‌కు కూడా రాలేదని, కానీ మహారాష్ట్రకు వెళ్లేందుకు మాత్రం ఆయనకు సమయం ఉంటుందని చురకలంటించారు.

రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజల ప్రయోజనాలను బీఆర్ఎస్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఒక సీఎంగా ఆయన తన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా ఫెయిలయ్యారని కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తమ వాయిస్ వినిపించాలని మీటింగులకు ఆహ్వానించిన సీఎం ఎందుకు వెళ్లడంలేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాల నడుమ ఇలాంటి ఘర్షణాత్మక వైఖరి కొనసాగించడం తెలంగాణకే తీరని నష్టమని ఆయన చెప్పారు. కేసీఆర్.. ఈరోజు ఎన్ని సెటిల్ మెంట్లు చేశాం? ఎందరిని మోసం చేశామని బేరీజు వేసుకుంటారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ సర్కార్ ఎన్ని రోజులు అధికారంలో ఉంటే తెలంగాణ అన్ని రోజులు నష్టపోతూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సెక్రటేరియట్ ఓపెనింగ్‌కు గవర్నర్‌ను పిలవని బీఆర్ఎస్ నేతలు పార్లమెంట్ ఓపెనింగ్‌కు రాష్ట్రపతిని పిలవాలనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పలు ప్రారంభోత్సవాల్లో స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి పేరు పెట్టాలనే ప్రొటోకాల్ పాటించని వాళ్లు మాకు నీతులు చెబుతారా? అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.

కేంద్ర ప్రభుత్వ సహకారంలో సౌత్ ఇండియాలోనే మొదటిసారిగా జూన్ 3, 4 తేదీల్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతున్నాయన్నారు. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతున్నట్లు చెప్పారు. శ్రీనగర్‌లో ఇప్పటికే అనేక రకాల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. కానీ స్థానిక యువతకు స్కిల్స్ లేకపోవడంతో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వారికి నైపుణ్యాలు మెరుగుపరిచేలా తీర్చదిద్దాలన్నారు.

త్వరలో ఎన్నో ప్రైవేట్ ఇన్ స్టిట్యూషన్స్ అందుబాటులోకి వస్తున్నాయని, వాటిలో ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. జూన్ 3, 4 తేదీల్లో జరిగే జాబ్​మేళాకు వచ్చేవారు ముందుగా రిజిస్ట్రేషన్​చేయించుకోవాలని ఆయన సూచించారు. కంపెనీలు ఉద్యోగాలకు కొందరిని సెలక్ట్ చేసి ఇతరులను రిజెక్ట్ చేసినా తిరిగి వారికి కేంద్ర ప్రభుత్వమే నైపుణ్య శిక్షణనిచ్చి ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు. 8 తరగతి నుంచి పీహెచ్డీ వరకు అర్హత కలిగిన వారికి ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, వచ్చే వారు తమ సర్టిఫికెట్లు తెచ్చుకోవాలని ఆయన సూచించారు. ఎక్స్​పీరియన్స్ సర్టిఫికెట్ ఉన్నా తెచ్చుకోవాలని ఆయన సూచనలు చేశారు.


Next Story