- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి జూపల్లి కృష్ణారావు వినూత్న నిర్ణయం
మంత్రి జూపల్లి కృష్ణారావు వినూత్న నిర్ణయం

దిశ, వెబ్‌డెస్క్: ఆదివాసీలను ఆధునిక ప్రపంచంతో మమేకం చేసేందుకు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) వినూత్న నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం కుమ్మరికుంట ఆదివాసీ గూడాన్ని మంత్రి సందర్శించారు. నాగరికతకు ఆమడ దూరంలో, కొండ కోనల మధ్య బతుకులీడుస్తున్న గిరిజనులతో ఆయన నేరుగా ముచ్చటించి, వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి ఒడిలో ఉన్న మినీ కాశ్మీర్‌గా పిలిచే ఉమ్మడి ఆదిలాబాద్‌ను చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు వస్తుంటారు. కానీ, ఇక్కడే పుట్టి పెరిగిన అడవి బిడ్డలకు ఆధునిక ప్రపంచం ఎలా ఉంటుందో తెలియకపోవడం కలచివేసిందని, అందుకే కుమ్మరికుంట గూడెం ఆదివాసీలను ప్రత్యేక బస్సుల్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు తీసుకువెళ్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
కేవలం అడవికే పరిమితం కాకూడదు
నగరంలోని చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, ఆకాశహర్మ్యాలు, మెట్రో రైళ్లు నగరవాసుల జీవన విధానాన్ని చూపిస్తామని మంత్రి ప్రకటించారు. యువతకి క్రీడల పట్ల ఆసక్తి పెంచేలా హైదరాబాద్‌లో వారికి క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి ఆటలను కూడా చూపిస్తామని చెప్పారు. ఆదివాసీలు కేవలం అడవికి పరిమితం కాకూడదాని, వారు బయటి ప్రపంచాన్ని చూడాలి, జ్ఞానంతో వారి బతుకులను, వారి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ పర్యటనకు అయ్యే రవాణా, భోజన, వసతి ఖర్చులన్నీ పర్యాటక, సాంస్కృతిక శాఖ భరిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 78 వసంతాలు గడిచినా, నేటికీ ఆదివాసీ గూడాల్లో దుర్భర పరిస్థితులు కొనసాగడం విచారకరమని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల జీవన ప్రమాణాలు ఇంకా మెరుగుపడకపోవడంపై అధికారులతో చర్చించి, జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.






