టీఎస్పీఎస్సీ స్కాం కాదు.. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు : మంత్రి గంగుల కమలాకర్

by Disha Web |
టీఎస్పీఎస్సీ స్కాం కాదు.. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు : మంత్రి గంగుల కమలాకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్ రెడ్డి రాజకీయ లబ్ధికోసం చౌకబారు మాటలు మానుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ భవన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగబద్ద సంస్థల్లో ప్రభుత్వాల ప్రమేయం ఉండదనే విషయం తెలిసి కూడా ప్రతిపక్షాలు తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నాయన్నారు. లీక్ విషయం తెలిసిన వెంటనే ఈనెల 12నే సిట్ వేసి విచారణ ప్రారంభించామని, అదేరోజు ఇద్దరు నిందితులను అరెస్టు చేశామన్నారు.

ప్రతిపక్షాలు ఈసోయి లేకుండా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తెలంగాణ కాంగ్రెస్లో పోటీ పాదయాత్రలు నడుస్తున్నాయని, బట్టి పాదయాత్ర కనుమరుగు కావడానికే కేటీఆర్ పై ఆధారం లేని ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలవాలని రేవంత్ ప్రయత్నిస్తున్నాడని దుయ్యబట్టారు. యాత్రలతో ప్రజలను కాంగ్రెస్ మభ్యపెడుతుందని ఆరోపించారు. బీసీ బిడ్డైన కేటీఆర్ పీఏ తిరుపతి పై రేవంత్ ఆరోపణలు మానుకోవాలని, ఈ అసంబద్ద ఆరోపణల్ని ఎవరూ నమ్మోద్దని సూచించారు.

రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కేటీఆర్ పీఏ గ్రామం పక్కనే ఉండటం తప్పా..? అసలు నిందితుడు రాజశేఖర్ రెడ్డికి మాకు ఏం సంబంధమని ప్రశ్నించారు. రేవంత్, సంజయ్ ప్రజల్లో భయాందోళనలు కలిగించి వారి భవిష్యత్ నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ప్రతిపక్షాలను నమ్మే పరిస్థితి లేదన్నారు. స్కాంలకు పెట్టింది పేరు కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. స్కాంల ప్రభుత్వం నడిపిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డే షర్మిల అన్నారు. విపక్షాలన్ని ఒకే తాను ముక్కలన్నారు.

స్కాం అని.. కుంభకోణం అని ప్రతిపక్షాలు ప్రజలను, నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నాయని, కానీ ఇది ఇద్దరు వ్యక్తులు చేసిన దుశ్చర్య అన్నారు. నాడు రోశయ్య హయాంలో ఎపీపీఎస్సీ స్కాంలో నాటి సభ్యుడు రిపుంజయ్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు నాటి ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేసారా.. ముఖ్యమంత్రి రాజీనామా చేసారా అని ప్రశ్నించారు. అదే విధంగా 2010లో యూపీఎస్సీ అవకతవకలకు సంబంధించి జాయ్స్ జాయ్ని అరెస్ట్ చేస్తే ప్రధాని రాజీనామా చేసారా అని ప్రశ్నించారు.

దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రోజుకో పేపర్ లీకేజీ, పూటకో ఉద్యోగ కుంభకోణాలు జరుగుతున్న విషయం ప్రజలకు తెలుసన్నారు. కర్ణాటక, యూపీ, గుజరాత్‌లో జరిగిన ఘటనలు జరిగాయి అక్కడి మంత్రులు, ప్రభుత్వాలు రాజీనామా చేశారా? అన్నారు. బొంబాయి, బీవండి వలసల్ని మళ్లీ తేవడానికా కాంగ్రెస్ ప్రయత్నాలు అన్నారు. టీఎస్పీఎస్సీ ఘటన కాంగ్రెస్, బీజేపీ బయటపెట్టలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వమే బయటపెట్టిందన్నారు. తప్పు చేసిన వారు ఎంతటివారైనా శిక్షించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, పారదర్శకంగా తక్షణమే చర్యలు తీసుకొని ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందన్నారు. ఈ సమావేశంలో శాసన మండలి చీఫ్ విప్ టి. భానుప్రసాద్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, బీఆర్ఎస్ కార్మిక విభాగం నేత రూప్ సింగ్ పాల్గొన్నారు.Next Story