- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్కారుపై ఆర్టీఐ అస్త్రం.. ఆ మంత్రి టార్గెట్ ఎవరు?
సాధారణంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ఆర్టీఐ అస్త్రాన్ని ఉపయోగిస్తుంటాయి.

దిశ,తెలంగాణ బ్యూరో : సాధారణంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ఆర్టీఐ అస్త్రాన్ని ఉపయోగిస్తుంటాయి. పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో లేని సమాచారాన్ని ఆర్టీఐ ద్వారా తీసుకుని సర్కారుపై ఎటాక్ చేస్తుంటాయి. కానీ ఈ మధ్య ఓ మంత్రి, ఆయన అనుచరులు సర్కారుపైనే ఆర్టీఐలో దరఖాస్తులు పెట్టడం హాట్‌టాపిక్‌గా మారింది. ఆ శాఖ ఈ శాఖ అనే తేడా లేకుండా సర్కారు తీసుకున్న కీలకమైన నిర్ణయాల గురించి తెలుసుకునేందుకు వరుసగా ఆర్టీఐ అప్లికేషన్లు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ అధికారులు ఇవ్వకపోతే సదరు అధికారులకు ఫోన్ చేసి దమ్కీలు ఇస్తున్నట్లు టాక్.
భూ కేటాయింపులు, టెండర్లపై ఫోకస్
ప్రధానంగా వివిధ సంస్థలు, వ్యక్తులకు కేటాయించిన భూముల వివరాలు, అలాగే కాంట్రాక్టు పనుల కోసం దాఖలైన టెండర్ల వివరాలను ఆర్టీఐ ద్వారా అడుగుతున్నట్లు తెలుస్తున్నది. పనులు దక్కించుకునేందుకు ఎన్ని కంపెనీలు టెండర్లు వేశాయి? ఆయా కంపెనీలు సమర్పించిన టెక్నికల్, ఫైనాన్సియల్ బిడ్స్ వివరాలు ఇవ్వాలని దరఖాస్తుల్లో పేర్కొంటున్నట్టు సమాచారం. జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు తమ పరిధిలోని సమాచారాన్ని ఇస్తున్నారని టాక్. కానీ కొందరు ఆఫీసర్లు సదరు అర్టీఐ అప్లికేషన్లకు స్పందించకుంటే మంత్రి అనుచరులు ఫోన్ చేసి తమదైన శైలీలో దమ్కీలు ఇస్తున్నట్లు తెలుస్తున్నది.‘మాకే సమాచారం ఇవ్వట్లేదు. కామన్ పబ్లిక్‌ను ఎలా సతాయిస్తారో అర్ధం అవుతుంది. మేం అడిగిన సమాచారం ఇవ్వకపోతే ఊర్కోం’ అని మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది.
సొంత శాఖపై సైతం దరఖాస్తులు
ఇతర శాఖల్లో జరుగుతున్న కీలక విషయాలను తెలుసుకునేందుకు సదరు మినిస్టర్ ఆర్టీఐ దరఖాస్తులు ఇవ్వడంతో పాటు, ఆయన పరిధిలోని శాఖల్లో సైతం ఆర్టీఐ అప్లికేషన్లు పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆ జిల్లాకు చెందిన లీడర్లు కామెంట్ చేస్తున్నారు. తను అడిగిన సమాచారాన్ని అధికారులు ఇవ్వనందుకు అలా చేస్తున్నారా? లేక మరేదైన ఉద్దేశ్యం ఉందా? అనే కోణంలో చర్చ జరుగుతున్నది. సహజంగా మంత్రులు అడిగిన సమాచారాన్ని అధికారులు వెంటనే ఇస్తుంటారు. ఒకవేళ ఇస్తే తమకు ఇబ్బందిగా మారుతుందని ఆఫీసర్లు భావిస్తే దాటవేస్తుంటారు. దీంతో మంత్రులు మరో దారిలో తమకు కావాల్సిన సమాచారాన్ని పొందడం రోటీన్‌గా జరుగుతుంటుంది. అయితే, తన సొంత శాఖకు చెందిన సమాచారాన్ని తెలుసుకునేందుకు మంత్రి అర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారంటే ఆ శాఖకు చెందిన అధికారులు సదరు మంత్రి మాట వినడం లేదని అర్థం చేసుకోవచ్చు.
మంత్రి టార్గెట్ ఎవరు?
గత కొన్ని రోజులుగా ఆర్టీఐ దరఖాస్తులు ఎందుకు చేస్తున్నారని మంత్రి సన్నిహితులను కోరగా వారు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ‘గత సర్కారులో ఏం జరిగింది? ఏ విధంగా నిబంధనలు ఉల్లంఘించారు? ఎవరికి టెండర్లు కట్టబెట్టారు? బీఆర్ఎస్ పార్టీ అనుకూల సంస్థలకు భూములు ఎంత కేటాయించారు?’ అని తెలుసుకునేందుకే ఆర్టీఐ ద్వారా సమాచారం తీసుకుంటున్నట్లు తెలిపారు. మరి సొంత శాఖలో ఎందుకు ఆర్టీఐ ద్వారా సమాచారం తీసుకుంటున్నారనే ప్రశ్నకు ‘బీఆర్ఎస్ హయాంలో మా శాఖ నుంచి రూ.కోట్లు కొల్లగొట్టారు. ఆ విషయాలను ఆధారాలతో సహా అసెంబ్లీలో చెప్పేందుకే ఆర్టీఐకు అప్లికేషన్లు పెడుతున్నాం’ అని వివరించారు. అయితే, సదరు మంత్రి భవిష్యత్ రాజకీయాలను పక్కాగా అంచనా వేస్తారని, చివరికు తన రాజకీయ భవిష్యత్ ఏంటో కూడా ముందే పసిగట్టి, ప్లానింగ్ చేసుకుంటారని పేరుంది. అందుకే సర్కారులోని కీలక సమాచారాన్ని ఎందుకైన మంచిదనే ఉద్దేశ్యంతో ముందుగానే సేకరిస్తున్నారేమో అనే అనుమానం ఆ జిల్లా రాజకీయ వర్గాల్లో మొదలైంది.






